హోమ్ /వార్తలు /national /

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

కేసీఆర్, వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఫోటో)

కేసీఆర్, వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఫోటో)

KCR Venkatramireddy: వెంకట్రామిరెడ్డి సొంత జిల్లా కామారెడ్డి అయినప్పటికీ.. ఆయన ఎక్కువగా సిద్ధిపేట జిల్లాలోనే విధులు నిర్వహించారు. దీంతో ఆయన సేవలను సిద్ధిపేట జిల్లా కోసం కేసీఆర్ వినియోగించుకుంటారా ? అనే టాక్ వినిపిస్తోంది.

నిన్నటివరకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావడం దాదాపుగా లాంఛనమే. నిన్న ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే.. ఆయనకు టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ పదవి ఖాయమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉన్నట్టుండి ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ ఛాన్స్ ఇవ్వడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అనేకమంది నేతలు ఎమ్మెల్సీ పదవులపై ఆశలుపెట్టుకున్నారు. కేసీఆర్ సైతం గతంలో అనేక మందికి బహిరంగంగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు.

పార్టీలో చేరిన ఇతర పార్టీలకు చెందిన నేతలకు సైతం ఆయన ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఇలా అనేక మంది నేతలకు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వారిని కాదని వెంకట్రామిరెడ్డికి ఈ పదవి కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటనే అంశం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కలెక్టర్‌గా కొనసాగుతున్నప్పటి నుంచే వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయన గతంలోనే టీఆర్ఎస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మల్కాజ్ గిరి ఎంపీ సీటుతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు ప్రచారం సాగింది. కానీ.. అప్పట్లో ఆయనకు కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. చాలాకాలం పాటు యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలని ఎదురుచూస్తున్న వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ఈ రకంగా అవకాశం ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రామిరెడ్డి సేవలను సీఎం కేసీఆర్ ఏ రకంగా ఉపయోగించుకుంటారనే దానిపై కూడా టీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వెంకట్రామిరెడ్డి సొంత జిల్లా కామారెడ్డి అయినప్పటికీ.. ఆయన ఎక్కువగా సిద్ధిపేట జిల్లాలోనే విధులు నిర్వహించారు. దీంతో ఆయన సేవలను సిద్ధిపేట జిల్లా కోసం కేసీఆర్ వినియోగించుకుంటారా ? అనే టాక్ వినిపిస్తోంది.


రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

అయితే సిద్ధిపేట జిల్లాలో టీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకోవడానికి మంత్రి హరీశ్ రావు వంటి సమర్థవంతమైన నాయకుడు ఉండటంతో.. వెంకట్రామిరెడ్డి సేవలను మరో చోట వినియోగించుకునే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. ఏదేమైనా.. గతంలో వెంకట్రామిరెడ్డికి ఇచ్చిన హామీ మేరకే సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా ? లేక ఆయనకు పదవి ఇవ్వడం వెనుక వేరే లెక్క ఉందా ? అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

First published:

Tags: CM KCR, Siddipet, Telangana