Award for Rammohan Naidu | టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న అవార్డు-2020కి ఎంపికయ్యారు. అతి పిన్న వయస్సులోనే ఈ అవార్డుకు ఎంపికైన ఎంపీగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. పార్లమెంటు సభ్యునిగా కనపరిచిన అత్యుత్తమ పనితీరు, ప్రజాసమస్యలపై పరిష్కారంలో ఎంపీ చూపిస్తున్న చొరవని గుర్తించి జ్యూరీ ప్రత్యేక అవార్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 8 మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులను 2019-20 సంవత్సరం సంసద్ రత్న అవార్డులకు ఎంపిక చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. తన నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, కింజరాపు కుటుంబ వారసునిగా ప్రజాసేవలో వున్న తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. రాజకీయ ప్రముఖులు శశి థరూర్, సుప్రియ సూలే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా తాను చేసిన సేవలను గుర్తించిన ప్రజలే తనను మళ్లీ ఎంపీగా ఎన్నుకున్నారని, ఈ అవార్డు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఈ పురస్కారం రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తన నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010 లో సంసద్ రత్న అవార్డులు ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి తగ్గి, లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరువాత అవార్డుల ప్రదానం కార్యక్రమం వుంటుందని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంసద్ రత్న అవార్డుల కమిటీ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.
ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన రామ్మోహన్ నాయుడు.. 2014 ఎన్నికల్లో తొలిసారి శ్రీకాకుళం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం అన్ని రాజకీయ పార్టీలను ఆకట్టుకుంది. 2019 ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ గాలి వీచినా.. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు. గల్లా జయదేవ్, కేశినేని నానితో పాటు రామ్మోహన్ నాయుడు రెండోసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Parliament, Rammohan naidu, Tdp