హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rajasthan Crisis | రాజస్థాన్‌లో తార స్థాయికి సంక్షోభం..గెహ్లాట్ చివరి ప్రయత్నాలు

Rajasthan Crisis | రాజస్థాన్‌లో తార స్థాయికి సంక్షోభం..గెహ్లాట్ చివరి ప్రయత్నాలు

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ (News18 Creative)

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ (News18 Creative)

Rajasthan Crisis Updates | రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో ఇక అక్కడి కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో ఇక అక్కడి కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ్లాట్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేబినెట్‌ మంత్రులతో సీఎం అశోక్ గెహ్లాట్ ఇవాళ(ఆదివారం) సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఇవాళ రాత్రి 9 గం.లకు సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్‌లో సమావేశంకానున్నారు. అటు సచిన్ పైలట్ మద్ధతుదారులైన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ సారథ్య బాధ్యతల నుంచి సచిన్ పైలట్‌ను తప్పించేందుకు గెహ్లాట్ వర్గం ప్రయత్నాలు చేస్తుండటమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని ప్రచారం జరుగుతోంది.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(పీటీఐ ఇమేజ్)

తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని అశోక్ గెహ్లాట్ శనివారం ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఎరవేసి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఆయన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. బీజేపీపై చేసిన ఆరోపణలను అశోక్ గెహ్లాట్ నిరూపించాలని... లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను సరిచేసుకోలేక... తమపై నిందలు వేయడం సరికాదని బీజేపీ నేత ఓం మాథూర్ పేర్కొన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య ఆధిపత్యపోరు కారణంగానే సంక్షోభం నెలకొంటోందని చెప్పారు. అయితే ఈ సంక్షోభం ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదని...అక్కడ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచే ఈ పరిస్థితులు ఉన్నాయన్నారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో నెలకొన్న విభేదాలను మరచిపెట్టి...అశోక్ గెహ్లాట్ బీజేపీని నిందించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

SOG నోటీసుపై సచిన్ పైలట్ గుర్రు..

గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బేరసారాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఈ వ్యవహారంపై తనకు కూడా ఎస్ఓజీ నోటీసు జారీ చేయడంపై సచిన్ పైలట్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన అశోక్ గెహ్లాట్...కాంగ్రెస్ వైపు వాదన చెప్పేందుకే తనతో పాటు డిప్యూటీ సీఎం, చీఫ్ విప్‌కు ఎస్ఓజీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. దీన్ని వక్రీకరిస్తూ ఓ వర్గం మీడియా కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డారు.

రాజస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తంచేశారు. పార్టీ కోసం తాను బాధపడుతున్నట్లు ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు చేజారిన తర్వాతే పార్టీ నేతలు మేల్కొంటున్నారంటూ అర్థమొచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు.

First published:

Tags: Ashok Gehlet, Rajasthan, Sachin Pilot

ఉత్తమ కథలు