రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి ‘శుభం’ కార్డుపడింది. కాంగ్రెస్ అధిష్టాన నేతలతో సోమవారం చర్చలు ఫలించి మళ్లీ సొంతగూటికి చేరాలని ఆ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్ నిర్ణయించుకున్నారు. ఇన్ని రోజులు సచిన్ పైలట్‌పై కారాలుమిరియాలు నూరిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పుడు స్వరం మార్చారు. సచిన్ పైలట్ మళ్లీ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం ద్వారా తనపై నమ్మకం ఉంచినట్లేనని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు చేయనిప్రయత్నమంటూ లేదంటూ తూర్పారబట్టారు. బీజేపీ నేతలు ఎన్ని బేరసారాలు జరిపినా...ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా తమ వైపునకు తిప్పుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. సంక్షోభ సమయంలో తన వెంట నిలబడి కొత్త చరిత్ర సృష్టించిన పార్టీ ఎమ్మెల్యేలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తన ప్రభుత్వం పూర్తి పదవీకాలన్ని పూర్తి చేసుకుంటుందని అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తంచేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనపై తిరుగుబాటు చేయటానికి కారణాలు ఏంటో తెలుసుకుని...వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని గెహ్లాట్ చెప్పారు. అలాగే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ...అసంతృప్త పార్టీ ఎమ్మెల్యేల సమస్యలు అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటుందని అన్నారు.
కాంగ్రెస్ పెద్దల రాజ ప్రయత్నాలు ఫలించడంతో..సచిన్ పైలట్ నేతృత్వంలోని కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో గత నెల రోజులుగా నెలకొన్న సంక్షోభం సమిసిపోయినట్లయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, Rajastan, Sachin Pilot