Rahul Gandhi meets UK MP Jeremy Corbyn:యూకే పర్యటలో ఉన్న కాంగ్రెస్(Congress)అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)..బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు, లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌ను సోమవారం లండన్ లో కలిశారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్ ఈ ఫొటోను షేర్ చేసింది. అయితే జెరెమీ కార్బిన్‌ను రాహుల్ గాంధీ కలవడం దేశంలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణం జెరెమీ కార్బిన్ గతంలో భారత్ వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. 2015 నుంచి 2020 మధ్య బ్రిటన్ పార్లమెంట్లో విపక్ష నేతగా పనిచేసిన జెరెమీ.. పలు విషయాల్లో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరుచేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. అటువంటి వ్యక్తిని రాహుల్ కలవడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జెరెమీ కార్బిన్ ను రాహుల్ ఎందుకు కలిశారని బీజేపీ ప్రశ్నిస్తోంది. జెరెమీ గతంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, వాటికి రాహుల్ మద్దతిస్తున్నారా అని బీజేపీ ప్రశ్నించింది. కశ్మీర్ వేర్పాటును ప్రోత్సహించే జెరెమీ కార్బిన్ ని రాహుల్ కలిశారని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి కిరెన్ రిజిజు..రాహుల్ గాంధీపై మండిపడ్డారు. సొంత దేశానికి వ్యతిరేకంగా ఎంతదూరం వెళ్లగలరని ప్రశ్నించారు.
బ్రిటన్ ఎంపీతో రాహుల్ భేటీని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా ప్రస్తావిస్తూ భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ ఎందుకు సమావేశమయ్యారని నిలదీశారు. బ్రిటన్ ఎంపీతో రాహుల్ ఫోటోను కూడా పూనావాలా షేర్ చేశారు. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారితో రాహుల్ గాంధీ ఎందుకు ఎప్పుడూ చేతులు కలుపుతుంటారని ప్రశ్నించారు. బీజేపీ నేత కపిల్ మిశ్ర సైతం రాహుల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యక్తిగా జెరెమీ కార్బిన్ సుపరిచితులు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలని జెరెమీ బహిరంగంగా సూచించారు. ఆయనతో రాహుల్ గాంధీ లండన్‌లో ఏం చేస్తున్నారు?" అని ప్రశ్నించారు.
ALSO READ Hardik Patel : హిందువులంటే అంత ద్వేషం ఎందుకు..కాంగ్రెస్ పై హార్దిక్ పటేల్ ఫైర్
ఇక,బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గతంలో జెరెమీని మోదీ కలిసిన ఫొటోను షేర్ చేస్తూ.. అదే ప్రశ్నను బీజేపీకి సంధించింది. కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ..."జెరెమీతో భేటీ అయినప్పుడు మోదీ ఏం చర్చించారని మీడియా మిత్రులు బీజేపీని అడగాలి. జెరెమీ అభిప్రాయాలకు మోదీ మద్దతు పలికారా? భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్న నేతతో భేటీ కావడం తప్పు కాదు, నేరమూ కాదు. అలాగైతే, ప్రధాని మోదీ.. ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీని దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లారో మీడియా అడగాలి. వీరిద్దరి ఫొటోల గురించి ప్రశ్నించాలి. బహిరంగ సభలో మెహుల్ ఛోక్సీని మా సోదరుడు మెహుల్ అని సంబోధించిన వీడియో గురించి అడగాలి. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు జిన్‌పింగ్‌తో మోదీ ఎందుకు సమావేశమయ్యారు? అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు మోదీ పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు? భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారిని కలవబోమని ప్రభుత్వం ఇప్పుడు హామీ ఇస్తుందా?"అని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, London, Rahul Gandhi