Rahul gandhi on adani : గత కొద్దిరోజులుగా భారత స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్న అదానీ ఇష్యూపై ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా.. అదానీ ఇష్యూపై లోక్ సభలో రాహుల్ గాంధీ ఫుల్ సీరియస్ అయ్యారు. పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ(Gautam Adani)తో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గట్టిగా నిలదీశారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర లో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఒకే ఒక వ్యాపారవేత్త పేరు వినిపించిందని, అది గౌతమ్ అదానీ అని రాహుల్ గాంధీ చెప్పారు. అదానీ ఏ వ్యాపారంలోకి అయినా ప్రవేశిస్తారు. ఆయన ఎన్నడూ విఫలమవరు అని ప్రజలు భారత్ జోడో యాత్ర సమయంలో తనతో అనేవారని రాహుల్ తెలిపారు. ప్రతి వ్యాపారంలోనూ ఆయన ఏ విధంగా విజయం సాధిస్తున్నారు? ఆయన ఎన్నడూ ఎందుకు విఫలమవడం లేదు? ఏమిటి ఆ మాయాజాలం? ఏమిటి ఈ సంబంధం? అని వారు తనను అడిగారన్నారు.
కాశ్మీర్, హిమాచల్‌లోని ఆపిల్‌ల నుండి ఓడరేవులు, విమానాశ్రయాలు,మనం నడుస్తున్న రోడ్ల వరకు అదానీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారన్నారని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ ఇజ్రాయెల్ రక్షణ ఒప్పందాల కాంట్రాక్టులన్నీ అదానికే ఇచ్చారని విమర్శించారు. భారత్-ఇజ్రాయెల్ రక్షణ సంబంధాలు అదానీ చేతుల్లోకి వెళ్లాయన్నారు. అదానీ ఎన్నడూ డ్రోన్లను తయారు చేయలేదని, హెచ్ఏఎల్ వాటిని తయారు చేసిందని చెప్పారు. అయినప్పటికీ మోదీ ఇజ్రాయెల్ వెళ్లిన తర్వాత, అదానీకి కాంట్రాక్టు దక్కిందని అన్నారు. అదానీకి రక్షణ రంగంలో అనుభవం శూన్యమన్నారు. నిన్న హెచ్‌ఏఎల్‌లో ప్రధాని మాట్లాడుతూ..తాము రఫేల్ డీల్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేశామని అన్నారని,అయితే వాస్తవానికి 126 విమానాల హెచ్‌ఏఎల్ కాంట్రాక్ట్ అనిల్ అంబానీకి వెళ్లిందన్నారు.
Unknown facts about pak : పాకిస్తాన్ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు..నిజమా అని ఆశ్చర్యపోవాల్సిందే
ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత అదానీకి ఎస్ బీఐ 1 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చిందని, తర్వాత ప్రధాని బంగ్లాదేశ్‌కు వెళ్లారని అప్పుడు బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు అదానీతో 25 ఏళ్ల ఒప్పందంపై సంతకం చేసిందని రాహుల్ అన్నారు. "చాలా ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే అదానీతో ఆయనకు సంబంధాలు మొదలయ్యాయని.. ఒక వ్యక్తి ప్రధాని మోదీతో భుజం భుజం కలిపి నిలబడ్డాడని, అదానీ ప్రధానికి విధేయుడిగా ఉన్నాడు, పునరుత్థానమైన(Resurgent)గుజరాత్ ఆలోచనను నిర్మించడంలో మోదీకి సహాయం చేశాడని.. 2014లో ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు మ్యాజిక్ మొదలైంది" అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మోదీ-అదానీ కలిసి ఉన్న ఓ ఫొటోను లోక్‌సభలో రాహుల్ ప్రదర్శించారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా జోక్యం చేసుకుని, ఇటువంటి పోస్టర్లు సభ గౌరవానికి తగినవి కాదన్నారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ఇది కేవలం ఓ ఫొటో అని, పోస్టర్ కాదని అన్నారు. ,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adani group, Parliament, Pm modi, Rahul Gandhi