హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు

Dubbaka ByPolls: దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

Dubbaka BJP Candidate Raghunandan Rao: తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రఘునందన్ రావును అభ్యర్థిగా ఎంపిక చేసింది.

  తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రఘునందన్ రావును అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడింది. మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఉప ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, వాటితోపాటు తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికకు కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. దుబ్బాక టికెట్ తనకే వస్తుందని రఘునందన్ రావు ముందు నుంచే ధీమాగా ఉన్నారు. అందుకే ఆయన గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రఘునందన్ రావుకు 22, 595 ఓట్లు రాగా, మూడోస్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ సోలిపేట రామలింగారెడ్డికి 89,299 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వర్ రెడ్డికి 26, 799 ఓట్లు వచ్చాయి. రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలో నిలిపింది. అయితే, టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  మరోవైపు ఎన్నికలకు ముందే రఘునందన్ రావు వివాదంలో చిక్కుకున్నారు. ఈనెల 5వ తేదీ రాత్రి హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌టాక్స్‌ సమీపంలో ఎస్‌ఓటీ పోలీసులు రూ.40 లక్షల నగదును పట్టుకున్నారు. కారులో రూ.40 లక్షల నగదు తరలిస్తుండగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులతో సహా వాహనాన్ని.. సదరు వ్యక్తులను స్థానిక స్టేషన్‌లో అప్పగించారు. రఘునందన్ రావుకు అందించడానికి తరలిస్తుండగా వాటిని పట్టుకున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ నగదును తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. డబ్బును తరలిస్తున్న వ్యక్తులతో రఘునందన్ రావు పీఏ మాట్లాడిన ఆడియో తమకు లభించిందని, దీనిపై రఘునందన్ రావును కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తామన్నారు.

  మరోవైపు దుబ్బాకలో యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక కూడా పోటీచేస్తానని ప్రకటించారు. ఆమె కూడా కొన్ని రోజులుగా దుబ్బాకలోనే ఉంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండే కత్తి కార్తీకకు దుబ్బాక ప్రజల కష్టాలు ఏంతెలుసంటూ తనను ప్రశ్నించే వారికి తాను ఇకపై ఇక్కడే ఉంటానని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం దుబ్బాక వెళ్తున్న సమయంలో కత్తి కార్తీక డ్రైవర్‌ను ఇన్నోవా కారులో వచ్చిన కొందరు దుండగులు హెచ్చరించారు. ‘కత్తి కార్తీకతో పాటు నువ్వు కూడా అన్నీ సర్దుకొని హైదరాబాద్ పారిపోండి. లేదంటే కాల్చిపారేస్తాం.’ అని వారు హెచ్చరించినట్టు కత్తి కార్తీక మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా కూడా తాను దుబ్బాకలో పోటీ చేస్తానని కత్తి కార్తీక స్పష్టం చేశారు.

  దుబ్బాకలో నవంబరు 3న పోలింగ్ జరగనుంది. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana, Telangana bjp

  ఉత్తమ కథలు