హోమ్ /వార్తలు /national /

Exclusive | రఘురామకృష్ణంరాజుతో ఇంటర్వ్యూ... అసలు ‘ప్రాబ్లమ్’ చెప్పిన ఎంపీ..

Exclusive | రఘురామకృష్ణంరాజుతో ఇంటర్వ్యూ... అసలు ‘ప్రాబ్లమ్’ చెప్పిన ఎంపీ..

రఘురామకృష్ణంరాజు(Image: Facebook)

రఘురామకృష్ణంరాజు(Image: Facebook)

Raghu Ramakrishnam Raju | ‘మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పండంటూ నోటీసులు ఇచ్చారు. సస్పెండ్ చేయాలనే ప్రణాళికతోనే నోటీసులు ఇచ్చారనుకోవచ్చా.’ అనే ప్రశ్నకు ఆయన ఏం సమాధానం ఇచ్చారో ఇంటర్వ్యూలో చదవండి.

  (పీవీ రమణకుమార్, న్యూస్ 18)

  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తనను ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే.. తాను సస్పెండ్ చేసేంత స్థాయిలో పార్టీని ధిక్కరించలేదని... తాను లేవనెత్తిన అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించాని రఘురామ రాజు న్యూస్ 18 ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పార్టీలో ఒకరిద్దరు వ్యక్తుల కారణంగానే సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. తనకు జగన్ పై విశ్వాసం ఉందని.. రానున్న ఎన్నికల్లోనూ వైసీపీ నుంచే పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న రఘురామకృష్ణ రాజు ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.

  ప్ర. షోకాజ్ నోటీసు వచ్చింది. ఏంటి పరిస్థితి?

  జ. 18 పేజీల షోకాజ్ నోటీసు వచ్చింది. మూడు నాలుగు సార్లు చదివాను. వాళ్లిచ్చిన నోటీసుల్లో పొందుపరచిన పేపర్ కటింగ్స్ లోనే దాదాపుగా నా వివరణ కూడా ఉంది. సమాధానం ఇవ్వడం క్లిష్టమైంది ఏం కాదు. నేనిచ్చిన వివరణకు మా ముఖ్యమంత్రి చదివితే ఆయన సంతృప్తి చెందుతారన్న విశ్వాసం నాకుంది. నోటీసులు ఇచ్చింది పార్టీ ప్రధాన కార్యదర్శే అయినా... నేను ఎంపీని కాబట్టి సస్పెండ్ చేయాలా వద్దా అనే నిర్ణయం సీఎం తీసుకుంటారనుకుంటా. నన్ను సస్పెండ్ చేసే అంశాలు పెద్దగా ఏం లేవు. నేను పార్టీకి, ముఖ్యమంత్రికి విధేయునిగానే ఉన్నాను. ఒకరిద్దరి కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తోందని చెప్పాను. కొన్ని కొన్ని విధానాల వల్ల ప్రజలు మనల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉందని భావించి ముఖ్యమంత్రికి విషయం చెప్పేందుకు ప్రయత్నించాను. ఆయన అపాయింట్మెంట్ దొరక్క మీడియాకు చెప్పాను.

  ప్ర. షోకాజ్ నోటీసు పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది. 

  జ. షోకాజ్ నోటీసు అంటే మీరు చేసిన చర్యల వల్ల మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అనేది దాని మీనింగ్. నేను ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కొంత మంది ఎమ్మెల్యేలే నన్ను రెచ్చగొట్టి రాజీనామా చేయమన్నారు. మీరు చేస్తే నేను చేస్తాను అని చెప్పాను.

  ప్ర. షోకాజ్ నోటీసులోనే మిమ్మల్ని ఎందుకు సస్పెడ్ చేయకూడదు అని పేర్కొన్నారు. అంటే సస్పెండ్ చేసే ఆలోచనలోనే పార్టీ ఉందని అనుకోవచ్చా. లేదంటే ఏదైనా తీవ్రమైన చర్య తీసుకుంటారా?

  జ. అలా అని నేను అనుకోవడం లేదు. సస్పెండ్ చేసేందుకు కారణం ఉండాలి. తిరుపతి భూముల అమ్మొద్దు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పాను. దానికి ముఖ్యమంత్రే స్పందించారు. భూముల వేలం రద్దు చేశారు. ఇసుక సరఫరా జరగడం లేదు. రూ.40 వేల ధర పెరిగి పోయిందని చెప్పాను. దీనిపై నాతో పాటు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. వారికి కూడా షోకాజ్ ఇస్తారేమో తెలియదు కాని సీఎం దీనిపై స్పందించారు. ఏపీ మైనింగ్ కార్పోరేషన్ ఎండీని కూడా మార్చారు. ఇళ్ల స్థలాల కొనుగోలు విషయంలో వచ్చిన ఆరోపణపై సంబంధిత మంత్రి స్పందించారు. నేను లేవనెత్తిన అంశాలన్నింటిపై సీఎం స్పందించారు. నోటీసులు ఇచ్చిన వ్యక్తికి ఈ విషయం తెలియదని అనుకుంటాను. నేను పార్టీలో సభ్యున్ని... ఎంపీగా ప్రభుత్వంలో భాగస్వామిని. నేను చెప్పింది ప్రభుత్వం పాజిటీవ్ గా స్పందించి చర్యలు తీసుకుంది. పార్టీ మాత్రం నా మీద చర్యలెందుకు తీసుకోవద్దు అంటోంది. ఇదే విచిత్రంగా ఉంది.

  ప్ర. ప్రభుత్వం, పార్టీ స్పందించే వరకు వేచి చూడకుండా మీ వాదన మీరు వినిపించుకుంటూ పోయారనే విమర్శకు సమాధానం?

  జ. ఆంగ్ల మాధ్యమం విషయంలో నేను వ్యతిరేకం కాదని చెప్పాను. నోటీసుల్లో పార్టీ జత చేసిన పేపర్ కటింగ్ లోనే వివరణ ఉంది. అది చదవకుండా నోటీసులు ఇచ్చారేమో.

  ప్ర. బతిమాలితేనే పార్టీలోకి వచ్చానన్నారు. ఇది పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టు... తక్కువ చేసి మాట్లాడినట్టు కాదా.. 

  జ. రమ్మంటే వచ్చానన్నాను. తప్పేంటి. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నాను. మా పార్టీ విధానం కూడా అమరావతే కదా. పార్టీ మూడు రాజధానులని చెప్పారు. నేనూ అదే చెప్పాను. ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ వైజాగ్, లెజిస్లేటీవ్ క్యాపిటల్ అమరావతి అనుకుంటున్నాం. ఈ కరోనా దెబ్బతో నిధులకు ఇబ్బంది ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ అన్ని ప్రాంతాలు తిరిగారు. చాలా భవనాలు చూశారు. 80 శాతం వరకు భవనాలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ గా అమరావతిని కొనసాగించి లెజిస్లేటీవ్ క్యాపిటల్ గా వైజాగ్ ఎందుకు చేయకూడదు అని అడిగా? ఇది కేవలం సలహా మాత్రమే. ఎవరైనా మంచి సూచనలు ఇవ్వొచ్చు కదా.

  ప్ర. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో మీ వ్యాఖ్యలపై ఏమంటారు. 

  . నేను వైఎస్సార్ సీపీ తరఫున ప్రజల చేత ఎన్నికయ్యాను. ఇది జగమెరిగిన సత్యం. మనం న్యాయస్థానాలను గౌరవించాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చెల్లుతుందని చెప్పాను. దానికి పేపర్ లో టైటిల్ అలా పెట్టారు.

  ప్ర. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మీరు ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేక విధానం కాదా? 

  జ. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. మీడియా వారు హైకోర్టు తీర్పు చెల్లుతుందా అని అడిగితే చెల్లుతుందని చెప్పాను. చెల్లదంతే కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది. అప్పుడు కోర్టు నాకు షోకాజ్ ఇస్తుంది. కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పువచ్చే వరకు హైకోర్టు తీర్పు చెల్లుతుందని అందరికీ తెలుసు. కానీ విలేకరులు అడిగారు కాబట్టి చెప్పాను. అలాగని మీడియా సృష్టి అని అనను. మీరు అనుకుంటే అనుకోండి. నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఏ మీడియా ప్రశ్నించినా సమాధానం చెబుతా.

  ప్ర. మీరు పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడనప్పుడు పేచీ ఎక్కడొచ్చిందంటారు.

  జ. నేను పార్టీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని, పార్టీ విధానాలను తప్ప వేరే వారి నాయకత్వాన్ని అంగీకరించనని ఒకట్రెండు సందర్భాల్లో చెప్పాను. ఆ నాయకులకు కోపం వచ్చి నోటీసులు ఇప్పించారని అనుకుంటాను.

  ప్ర. వారెవరు. 

  జ. నేను దానిపై మాట్లాడను.

  ప్ర. మీరు మీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చాలెంజ్ చేశారు.

  జ. అందర్నీ అనలేదు. నా పరిధిలో ఐదుగురు వైసీపీ వాళ్లున్నారు. ఇద్దరు టీడీపీ వాళ్లున్నారు. మా పార్టీ వాళ్లు నన్ను రాజీనామా చేయమంటే మీరు చేయండి.. నేనూ చేస్తాను అన్నాను. వాళ్లతో ఎవరు మాట్లాడించారో నాకు తెలియదు.

  ప్ర. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు సీఎంకు చెప్పే ప్రయత్నం చేయలేదా.

  జ. ఎన్నో సార్లు చేశాను. టైం అడిగాను. ఆయన టైం ఇవ్వలేదు. మీడియాలో చెప్పాను.

  ప్ర. మీకు సమయం ఇవ్వకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది. 

  జ. ఆయన మనస్సులో ఏముందో నాకెలా తెలుస్తుంది. మీకు టైం దొరికితే అడగండి. నాకు తెలిసి మీ జీవిత కాలంలో మా ముఖ్యమంత్రి సమయం దొరుకుతుందని నేననుకోను. ఆయన కరోనా సమయంలో చాలా బిజీగా ఉన్నారు. రకరకాల పాలసీ సంబంధిత అంశాలపై పని చేస్తున్నారు. నాకు సమయం దొరకలేదు అనేది నిజం.

  ప్ర. మీరు గతంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిశారు. మీరు విందు ఇచ్చిన సమయంలో చాలా మంది బీజేపీ పెద్దలు హాజరయ్యారు. ఎందుకు. మీరు బీజేపీతో దగ్గరగా పని చేస్తున్నారన్న భావనలో సీఎం ఏమైనా ఉన్నారనుకుంటున్నారా?

  జ. ఆ అంశం కూడా షోకాజ్ నోటీసులో ఉంది. ముఖ్యమంత్రి మనస్సులో ఏముందో నాకేం తెలుసు. మాట్లాడితే ఆయన మనస్సులో ఏముందని అడిగితే నేనేం చెప్పగలను. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి నేనెవరికి పార్టీ ఇచ్చాను. నా పార్టీకి ఎవరొచ్చారు లాంటి విషయాలు పట్టించుకుంటారని నేననుకోను. పక్కన ఉన్నోళ్ల సృష్టే అనుకుంటాను.

  ప్ర. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవహారం అంతా సజావుగా సాగుతుందనే అనుకుంటున్నారా.. 

  జ. నేనైతే అనుకుంటున్నా. నేను ముఖ్యమంత్రి గురించి ఒక్క మాటైనా మాట్లాడినట్టు ఏ వీడియో క్లిప్పింగ్ లో నైనా చూపించండి. నేనెప్పుడూ సీఎంను కానీ.. పార్టీని కానీ ఏమీ అనలేదు. నన్ను టార్గెట్ చేసిన కొద్ది మంది వ్యక్తుల మీద కౌంటర్ ఇచ్చాను.

  ప్ర. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పండంటూ నోటీసులు ఇచ్చారు. సస్పెండ్ చేయాలనే ప్రణాళికతోనే నోటీసులు ఇచ్చారనుకోవచ్చా. సస్పెండ్ అయితే పర్యవసనాలు ఎలా ఉంటాయి. 

  జ. సస్పెండ్ చేస్తే సస్పెడ్ అవుతా. అంతకంటే ఏమవదు కదా.

  ప్ర. వైసీపీ కాదంటే మీ పాత పార్టీలు ఉండనే ఉన్నాయంటారా?

  జ. అలా కాదు.. సస్పెండ్ అయితే ఎంపీగా కొనసాగుతాను. కాని సస్పెండ్ చేయరు. మీది ఊహాజనిత ప్రశ్న. అయినా నా విధులు నేను నిర్వర్థిస్తా. నా పదవీ కాలమంతా ప్రజలకు సేవ చేస్తా. ఐదేళ్ల తర్వాత చూద్దాం. అప్పుడు కూడా వైసీపీ తరఫున పోటీ చేస్తానని నేననుకుంటున్నా. మీరేమో సస్పెండ్ చేస్తారంటున్నారు.


  ప్ర. మీరు బతిమాలితేనే వైసీపీలో చేరొచ్చు. కానీ వైసీపీ ప్రభంజనంలో వేరే పార్టీ నుంచి గెలిచేవారా. 

  జ. నేను ఏ పార్టీ అయినా నెగ్గుతానని ముందే చెప్పాను. ఈ అంశం కూడా షోకాజ్ లో ఉంది. నేనన్న మాట మీడియాలో ఉన్న మాట ఎలా కాదంటాను. నాకు ప్రభంజనం లాంటి మెజారిటీ ఏం రాలేదు. నాకు 33,909 ఓట్ల మెజారిటీనే వచ్చింది. ఇతర రెండు పార్టీలకు ఏడు లక్షలొస్తే నాకు నాలుగు లక్షల యాభై వేలొచ్చాయి. రెండు లక్షల డెబ్బై వేల ఓట్లే తేడా. ఆ రెండు పార్టీలు కలిస్తే ఏమయ్యేది.  నర్సాపురంలో తెలుగుదేశం పార్టీ  కూడా బలమైన పార్టీయే. ఓట్ల తేడా తక్కువ కాబట్టి వేరే పార్టీ అయనా నెగ్గేవాడిని అని చెప్పాను. ఇది ఒక వ్యాఖ్య మాత్రమే.

  ప్ర. ఏ పార్టీ అయనా నెగ్గేవాన్ని అంటే వైసీపీ నాయకత్వాన్ని తక్కువ చేసినట్టు కాదా.. 

  జ. ఆ ఆలోచన వాళ్లకొచ్చిందో మీకొచ్చిందో తెలియదు కానీ, నాకైతే రాలేదు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju, Raghuramakrishnam raju

  ఉత్తమ కథలు