దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎంతైతే ఉత్సాహం చూపుతున్నారో, కాంగ్రెస్ సైతం ఆయన చేరికను అంతే కీలకంగానే భావిస్తున్నది. గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా అధినేత్రి సోనియా గాంధీ పార్టీయేతర వ్యక్తికి ఇంతగా ప్రాముఖ్యత ఇస్తుండటం, మూడు రోజుల వ్యవధిలో వరుసగా రెండు సార్లు పీకేను భేటీకి పిలవడం అనూహ్యపరిణామంగా నిలిచింది. పొలిటికల్ స్ట్రాటజిస్టుగా భిన్న ఐడియాలజీలున్న పార్టీలతో పనిచేసినప్పటికీ, పొలిటీషియన్ గా మాత్రం తాను బలంగా నమ్మే గాంధేయవాద పార్టీలోనే భవిష్యత్తు వెతుక్కోవాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తుండగా, ఆయన చేరికతో లాభం పొందే అవకాశాలున్నప్పటికీ ఇప్పటికే పీకే చేసుకున్న కమిట్మెంట్ల విషయంలో కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే అధికారికంగా కాంగ్రెస్ లోకి పీకే చేరిక ఉంటుందని సమాచారం.
కాంగ్రెస్ లో చేరేందుకు పీకేను అడ్డుగా నిలుస్తోన్న అంశాల్లో ప్రధానమైనది ఆయన వ్యూహకర్తగా పనిచేస్తున్న పార్టీలే అని, కాంగ్రెస్ విరోధులకు ఎన్నికల గెలుపు సలహాలు ఇస్తూ తిరిగి ఆ పార్టీలోనే నేతగా కొనసాగడం అసంభవం కనుక వ్యూహకర్త వృత్తిని పూర్తిగా వదిలేసి, పక్కా కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటానంటేనే చేరాల్సిందిగా అధిష్టానం పీకేకు సూచించినట్లు చర్చ జరుగుతోంది. పీకే ఇప్పటికీ అనుబంధం కొనసాగిస్తున్న పార్టీల్లో టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు సిద్దమైనట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ భాగస్వామినే. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తో మాట కలిపే అంశాన్ని 2024 ఫలితాలను బట్టి కాంగ్రెస్ పునరాలోచించే అవకాశముంది. ఒక్క టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అంశంలోనే పీకే-కాంగ్రెస్ మధ్య క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది.
నిజానికి ప్రశాంత్ కిషోర్ తో చర్చలు, ఆయన చేసిన ప్రెజెంటేషన్లను వినడం, పార్టీలోకి ఆహ్వానించడం లాంటి చర్యలతో సోనియా గాంధీ తన అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. గాంధీల కుటుంబ నాయకత్వాన్ని సవాలు చేస్తోన్న జీ-23 అసమ్మతి నేతలు మినహాయించి మిగతా సీనియర్లు చాలా మందితో పీకే చేరిక అంశంపై సోనియా అంతర్గత చర్చలు జరిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, అంతకంటే ముందు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పీకే ఇచ్చిన రోడ్ మ్యాప్ ను పరిశీలించేందుకు సోనియా ఓ కమిటీని కూడా నియమించాలని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలే తెలిపాయి. కేసీఆర్ కు కటీఫ్ చెప్పేస్తే ప్రశాంత్ కిషోర్ చేరిక ఖరారైనట్లేననీ కొందరు నేతలు అంటున్నారు.
ఈ గందరగోళం మధ్యనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి భేటీ అయ్యారు. సోమవారం రాత్రి 10 జన్ పథ్ వెళ్లిన పీకే సోనియాతో సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు మరికొద్ది నెలల్లో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వీరు చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానంతో పీకే భేటీ కావడం 3 రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు గత శనివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమైన పీకే.. మిషన్ 2024పై రోడ్ మ్యాప్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌కు సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో 370 నుంచి 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రణాళిక రచించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. పీకే ప్లాన్ పై కాంగ్రెస్ హైకమాండ్ ఈ నెలాఖరులోగా నిర్ణయాన్ని వెలిబుచ్చనుంది. అయితే పీకే-కాంగ్రెస్ చర్చల్లో రెండు తెలుగు రాష్ట్రాల పరిణామాలు కూడా కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో చేరబోతున్న ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తోనూ పీకేను గాఢానుభంధం ఉంది. టీఆర్ఎస్ తో పొత్తును కాంగ్రెస్ ఇంచార్జీలు తోసిపుచ్చగా, అసలు మిమ్మల్ని పొత్తు ఎవడు అడిగాడు? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటరిచ్చారు. గాంధీ కుటుంబం పేరు చెబితేనే అంతెత్తు మండిపడే వైఎస్ జగన్ కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు లేకున్నా, 2024 తర్వాత మారబోయే ఈక్వేషన్లలో పీకే ప్రధాన సంధానకర్తగా వ్యవహరించే అవకాశాలుంటాయి.
బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా 13 విపక్ష పార్టీలూ పరస్పర ప్రయోజనాల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించుకున్న క్రమంలోనే ఇటీవల ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేసీఆర్ పేరును పక్కనపెట్టేశారనే వాదన వినిపిస్తోంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరేలా ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కు కటీఫ్ చెబుతారా? పీకే ద్వారా కాంగ్రెస్-కేసీఆర్ ఒకటవుతున్నారన్న బీజేపీ వాదనకు చెక్ పెడతారా? లేక ఐపాక్ సంస్థకు, తనకూ ఎలాంటి సంబంధం లేదని గతంలోమాదిరిగానే చింతకాయ కబుర్లు చెబుతారా? అనేది వేచిచూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Congress, Prashant kishor, Sonia Gandhi, Telangana, Trs