దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్త వృత్తిని వదిలేసినట్లు చెప్పిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో సుదీర్గ చర్చలు జరపడం తెలిసిందే. తాను ఆశించినట్లు జరక్కపోవడంతో పీకే.. కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని పక్కనపెట్టేశారు.
కాగా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంతగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. కొత్త రాజకీయ పార్టీ లేదా రాజకీయ వేదికకు సంబంధించి పీకే సోమవారం నాడే ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉత్తరాది రాజకీయ వర్గాల్లో విసృత ప్రచారం జరుగుతున్నది. జాతీయ మీడియాలోనూ పీకే కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుపై కథనాలు వచ్చాయి.
గడిచిన కొద్ది నెలలుగా ఢిల్లీలోనే మకాం వేసి, మధ్యమధ్యలో హైదరాబాద్ వచ్చి వెళ్లిన ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటనను మాత్రం సొంత రాష్ట్రమైన బీహార్ నుంచే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పీకే ఆదివారం నాడే బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. అక్కడ తన శ్రేయోభిలాషులు, పలువురు భావసారూప్య పార్టీల నేతలతో పీకే చర్చలు జరిపినట్లు వెల్లడైంది. ఇవాళ ట్విటర్ వేదికగానే పీకే తన సొంత పార్టీ లేదా సొంత రాజకీయ వేదికపై ప్రకటన చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రశాంత్ కిషోర్ సొంత సంస్థ ఐపాక్ కు దేశవ్యాప్తంగా వాలంటీర్లు, ఉద్యోగులు ఉండటం ఒకఎత్తయితే, రాజకీయాల్లోకి యువత రావాలనే నినాదంతో పీకే టీమ్ చేపట్టిన డ్రైవ్ లోనూ అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పేర్ల నమోదు జరిగినట్లు సమాచారం. సొంత రాష్ట్రం బీహార్ లో పీకే ఇదివరకే గ్రామ స్థాయి నుంచి యువతతో కమిటీలు ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ప్రకటన తర్వాత ఆ కమిటీలకు మళ్లీ జీవం పోయాలని, అన్ని రాష్ట్రాల్లో సమాంతరంగా పార్టీ విస్తరణ జరిగేలా పీకే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరిస్తున్నానంటూ ప్రశాంత్ కిషోర్ గత వారం ప్రకటన చేసిన తర్వాత ఆయన ప్రయాణం ఏ దిశగా సాగుతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్న నేపథ్యంలో పీకే సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని బలోపేతం చేసే వ్యూహంతో వెళ్లిన తనకు కాంగ్రెస్ లో కీలక స్థానం దక్కుతుందని ఆశించారు. అయితే
పీకే సొంత సంస్థ ఐపాక్ ఇప్పటికే పలు పార్టీల కోసం పనిచేస్తుండటం, ఆయన స్వయంగా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో రెండు రోజులపాటు హైదరాబాద్ లోనే ఉండి చర్చలు జరపడంతో కాంగ్రెస్ సీనియర్లు ఆయన తీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఆయన చేరికను చాలా మంది నేతలు వ్యతిరేకించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Congress, Patna, Prashant kishor