30 ఇయర్స్ పృథ్వీ మీద నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా మండిపడ్డారు. రాజధానిలో రైతులు, మహిళల మీద పృథ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో రైతుల ఆందోళనలను ఉద్దేశించి పృథ్వీ ఇటీవల మాట్లాడుతూ.. ‘రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా?, బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా?’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వ్యాఖ్యలను పోసాని ఖండించారు. రైతులకు కార్లు ఉండకూడదా? అని ప్రశ్నించారు. పొలం పనిచేసే మహిళలు బంగారు గాజులు కొనుక్కోకూడదనా? అని నిలదీశారు. ‘రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నంతుకు పృథ్వీ సిగ్గు పడాలి. పృథ్వీకి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రాజధానిలో మహిళలకు క్షమాపణ చెప్పాలి. నమో వేంకటేశాయ అనే పృథ్వీని అప్పుడు వెంకటేశ్వరస్వామి క్షమిస్తాడు.’ అని పోసాని అన్నారు. జగన్ ఎప్పుడూ రైతులను ప్రేమిస్తూనే ఉంటారని పోసాని స్పష్టం చేశారు.
‘సీఎం జగన్ మోహన్ రెడ్డి సేవాభావంతో పనిచేస్తున్నారు. ప్రజల గురించి ఒక్క మాట కూడా జారలేదు. అలాంటి జగన్ను, ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి మీలాంటి వారు పుట్టారు. మీ లాంటి వారి వల్ల జగన్ మోహన్ రెడ్డిని మహిళలు, సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారంటే అందుకు మీలాంటి వారే కారణం. పృథ్వీ నాకు నీ మీద కక్ష లేదు. నువ్వు నా ఫ్రెండ్. ఏవైతే రైతుల గురించి తప్పుగా మాట్లాడావో వారికి బేషరతుగా క్షమాపణ చెప్పు. మీరు ఇలాగే మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టిస్తాడు.’ అని పోసాని కృష్ణమురళి అన్నారు.
‘నేను పదేళ్లుగా జగన్ను గౌరవిస్తున్నా. అప్పుడు నేను, రోజా మాత్రమే ఉన్నాం. వీళ్లంతా మూడు, నాలుగేళ్లుగా వచ్చిన వారే. ఈ పదేళ్లలో జగన్ ఎప్పుడూ ఓ కులం, మతం గురించి మాట్లాడలేదు. అందుకే జగన్ను నేను గౌరవిస్తున్నా.’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. పృథ్వీ లాంటి వారి మాటల వల్ల జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు.
మరోవైపు చంద్రబాబు ధర్నా మీద కూడా పోసాని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీవ్రంగా దుబారా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి కూడా ఓ పాలసీ ఉందన్నారు. అయితే, ప్రజా ప్రతినిధుల మీద రైతులు ఎవరూ దాడిచేయరని, రైతుల ముసుగులో వేరేవారు మాత్రమే దాడులు చేస్తున్నారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 30 Years Prudhvi Raj, Amaravati, Andhra Pradesh, Posani Krishna Murali