ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ – ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లాలో పొలిటికల్ హీట్ రేగింది. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మేనిఫెస్టో, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మేనిఫెస్టో విషయంలో మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా సవాళ్లు విసురుకున్నారు. రెండు పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమంటూ ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్న నేపథ్యంలో.. తాను గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమని.., దమ్ముంటే టచ్ చేసి చూడాలంటూ దేవినేని ఉమా ఛాలెంజ్ విసిరారు. దీంతో గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఐతే దేవినేని ఉమా మాస్క్, టోపీ ధరించి పోలీసులకు చిక్కకుండా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు దూసుకెళ్లారు. విగ్రహం పైకి ఎక్కేందుకు యత్నించగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. మరోవైపు దేవినేని ఉమా చేసిన సవాల్ పై చర్చకు సిద్ధమంటూ వైసీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు భారీగా చేరుకున్నారు. దేవినేని ఉమాతో చర్చకు మంత్రి కొడాలి నాని అవసరం లేదని.. తాము చాలని కార్యకర్తలు అన్నారు. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఈలోగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా మీడియాలో చర్చకు సిద్ధమని ప్రకటించారు.
ఆ డైలాగులు మావే..!
దేవినేని ఉమా టచ్ చేసి చూడి అనే కామెంట్స్ పై వంశీ తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. టచ్ చేసి చూడు సినిమా తనది, మంత్రి నానిదని..,మా సినిమాలు, డైలాగులు కాపీ కొడితే ఎలా..? అని పంచ్ విసిరారు. ఎవరు అవినీతి చేశారో..? ఎవరు కాలువల పేరుతో కోట్లు వెనకేసుకున్నారో చర్చిస్తే తేలిపోతుందన్నారు. అవినీతి ఆరోపణలపై కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకున్న వారు సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు వంశీ. టైమ్ మీరు చెప్పినా.. మేం చెప్పమన్నా.., ప్లేస్ నువ్వు చెప్పినా., మేం చెప్పమన్నా.. చర్చకు సిద్ధమని వంశీ సవాల్ విసిరారు. దేవినేని ఉమా పబ్లిసిటీ చేసుకోవడానికే అనవసర ప్రేలాపనలు పేలుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఏనీ సెంటర్ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దేవినేని ఉమాకు ధైర్యం లేకనే దొంగచాటుగా రోడ్డుపైకి వచ్చారన్నారు.
అసలేం జరగింది..?
గొల్లపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా మంత్రి కొడాలి నాని., టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాపై అవినీతి ఆరోపణలు చేశారు. హామీల పేరుతో ప్రజల్ని మోసం చేసిన ఘనత టీడీపీదేనని విమర్శించారు. రాజకీయాల్లో లేకుంటే దేవినేని ఉమాని చెప్పుతీసుకొని కొట్టేవాడ్నంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు ఏం చేశారో.. జగన్ ఏం చేశారో చర్చకు సిద్ధమన్నారు. నీ ఇంటికొచ్చి బడిత పూజ చేస్తానంటూ కొడాలి నాని హెచ్చరించారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమా గొల్లపూడి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వస్తానని దమ్ముంటే టచ్ చేసి చూడాలని ప్రతి సవాల్ విసిరారు.
ఒక్కడినే వస్తా..!
దేవినేని ఉమా ఎక్కడికి వచ్చినా చర్చకు సిద్ధమని మంత్రి కొడాలి నాని అన్నారు. నేను ఒక్కడినే వస్తా.. దమ్ముంటే ఉమా రావాలని నాని అన్నారు. దేవినేని ఉమాను కొట్టకపోతే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాని. బహిరంగ చర్చకు పోలీసులు అనుమతివ్వరని తెలిసే దేవినేని ఉమా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించిన నాని.., తాను ఫోన్ చేస్తే భయపడి లిఫ్ట్ చేయడం లేదని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తే ఎవరు ఎవరికి బడితెపూజ చేస్తారో చూద్దామన్నారు.
జిల్లాలో పొలిటికల్ వార్
కృష్ణాజిల్లాలో కొడాలి నాని - దేవినేని ఉమా మధ్య రాజకీయ వైరం ఇప్పటిదికాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో దేవినేని ఉమా చక్రం తిప్పారు. అప్పట్లో ఆయన చెప్పిందే వేదం. కాంట్రాక్టులు, ఇతర అభివృద్ధి పనుల విషయంలో ఇతర నియోజకవర్గాల్లోనూ దేవినేని ఉమా జోక్యం ఉండేదన్న ఆరోపణలు వినిపించాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా కొడాలి నాని కూడా దేవినేని ఉమాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో కొడాలిపై దేవినేని ఉమా తరచూ విమర్శలు చేస్తున్నారు. ఏకంగా బూతుల మంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా విమర్శలకు కొడాలి నాని తన స్టైల్లో కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన కొడాలి నాని.. దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP Politics, Devineni uma, Devineni Uma Maheswara Rao, Gannavaram, Gudivada, Kodali Nani, Krishna District, Police, Tdp, Vallabhaneni Vamshi, Ysrcp