హోమ్ /వార్తలు /national /

మళ్లీ మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ వద్ద పార్టీల డిమాండ్

మళ్లీ మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ వద్ద పార్టీల డిమాండ్

పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21తో ముగుస్తాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21తో ముగుస్తాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణపై ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి 11 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఏపీలో అధికార వైసీపీ సహా ఆరు పార్టీలు సమావేశానికి హాజరుకాలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి. ఈ ఏడాది మార్చిలో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఎన్నికలను మళ్లీనిర్వహించేందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 11 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఏపీలో అధికార వైసీపీ సహా ఆరు పార్టీలు సమావేశానికి హాజరుకాలేదు. అందులో జనసేన కూడా ఉంది. కానీ, జనసేన పార్టీ ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను ఎన్నికల సంఘం కమిషనర్‌కు తెలియజేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కలిసిన తర్వాత టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రత్యర్థులను బెదిరించి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నారని మండిపడ్డారు. కాబట్టి, కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఎన్నికలు వాయిదా వేసినప్పుడు కోర్టులకు వెళ్లిన వైసీపీ ఇప్పుడు ఎన్నికలు జరుపుతామంటే ఎందుకు వెనుకడుగు వేస్తోందని అచ్చెన్నాయుడు నిలదీశారు.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసి, తాజాగా మరోసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని సీపీఐ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. గతంలో అధికార వైసీపీ బెదిరింపుల ద్వారా ఏకగ్రీవాలు చేసుకుందని, కాబట్టి అవన్నీ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ కూడా అదే డిమాండ్ చేసింది. బీజేపీ తరఫున సత్యనారాయణ ఎన్నికల సంఘం సమావేశానికి హాజరయ్యారు. ఆయన కూడా అదే ఆరోపణలు చేశారు. గతంలో వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసిందని, అవన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ కూడా అదే డిమాండ్ చేసింది. మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. కరోనా దృష్ట్యా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని బీఎస్పీ నేత పుష్పరాజ్ సూచించారు. ఎన్నికల విషయంలో ఏం చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత చేయాలని సీపీఎం సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశానికి అధికార వైసీపీ, జనసేన హాజరుకాలేదు. జనసేన పార్టీ ఈ మెయిల్ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపింది. ఎస్ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనలను కూడా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించింది. కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా రహస్య సమావేశం నిర్వహిస్తున్నారని తప్పుపట్టింది. అయితే, వైసీపీ ఆరోపణలను ఎస్ఈసీ కార్యాలయం ఖండించింది. తాము వైద్య శాఖ సిబ్బందితో కరోనా గురించి చర్చించిన తర్వాతే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని చెప్పింది. ప్రభుత్వం ఆరోపణలను ఖండించింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bjp, CPI, CPM, Janasena, Nimmagadda Ramesh Kumar, Tdp, Ysrcp

ఉత్తమ కథలు