హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi Delhi Rally | సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర: ప్రధాని మోదీ

PM Modi Delhi Rally | సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర: ప్రధాని మోదీ

ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం (PTI)

ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం (PTI)

జామియా మిలియా యూనివర్సిటీ, షహీన్ బాగ్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.

  PM Narendra Modi Delhi Election Rally | దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ, షహీన్ బాగ్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి ప్రచారానికి వచ్చిన ఆయన ఈ రోజు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనలకు మరింత ఆజ్యం పోస్తున్నారంటూ ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మీద విమర్శలు గుప్పించారు.

  షహీన్ బాగ్‌లోనూ, జామియా మిలియా వర్సిటీలో జరుగుతున్న ఘటనలను ఆయన ఉదహరించారు. డిసెంబర్ 15 నుంచి షహీన్ బాగ్‌లో మహిళలను ముందు పెట్టి ఆందోళనలకు దిగుతున్నారని, అలాగే, జామియా వర్సిటీలో విద్యార్థులను ముందు పెట్టి నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. ‘సీలం పూర్ కావొచ్చు. జామియా కావొచ్చు. లేదా షహీన్ బాగ్ కావొచ్చు. గత కొన్ని రోజులుగా సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇవన్నీ యాధృచ్ఛికమా? కాదు. దీని వెనుక కుట్ర ఉంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.

  షహీన్ బాగ్‌లో ఆందోళనలు చేస్తున్న వారి వల్ల నోయిడాకు వెళ్లి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ‘ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలను చూసి ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. షహీన్ బాగ్ ఆందోళనల వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వారి బలం పెరిగితే మరో రోడ్డు లేదా మార్గాన్ని బ్లాక్ చేస్తారు. అలాంటి వారి చేతిలో మనం ఢిల్లీకి వదిలి పెట్టలేం. ఢిల్లీ ప్రజలు మాత్రమే దీన్ని అడ్డుకోగలరు. మీరు బీజేపీకి వేసే ఓటే దాన్ని అడ్డుకుంటుంది.’అని మోదీ అన్నారు.

  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రతి బీజేపీ నాయకుడి ప్రసంగంలోనూ షహీన్ బాగ్ అనేది ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. తాజాగా షహీన్ బాగ్‌లో ఆందోళన కారుల వద్ద ఓ యువకుడు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత, భయం నెలకొంది. ఆ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.

  జనవరి 30న కూడా ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీదకు ఓ 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఆ మైనర్‌ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ‘గోలీ మారో సాలోంకో’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని ఉద్దేశించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఇద్దరు యువకులు కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. అందరూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన రెచ్చగొట్టడం వల్లే యువకులు కాల్పులకు తెగబడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీలో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: AAP, Congress, Delhi Assembly Election 2020, Pm modi

  ఉత్తమ కథలు