Home /News /national /

POLITICS POLICE COMPLAINT AGAINST JANASENA CHIEF PAWAN KALYAN IN PULIVENDULA BY YSRCP LEADERS SU

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌‌పై పోలీసులకు ఫిర్యాదు.. అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

తిరుపతి ఎన్నికల ప్రచార సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

    ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయకులు కడప జిల్లాలోని పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు మండిపడ్డారు. ఈ మేరకు పులివెందుల అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, కౌన్సిలర్లు, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పులివెందుల గడ్డ అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు అన్నారు. పులివెందుల ప్రజలు ఇక్కడి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించారని అన్నారు. టీడీపీ, బీజేపీ ఇచ్చిన ప్యాకేజీలకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పులివెందుల ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

    ఇక, శనివారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వివేకా దారుణ హత్యకు గురైతే రెండేళ్లు గడుస్తున్నా ఎవరు చంపారో తెలియకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ కుటుంబం రాష్ట్రానికి ఐఏఎస్ ఎన్నో సేవలు చేశారని.. ఆమెను గెలిపిస్తే తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. వైసీపీ గూండాలకు ఎంతకాలం భయపడతామని .. సామాన్యులపై ప్రతాపం కాదు దమ్ముంటే తనపై చూపించాలని విసిరారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ.. "పులి వెందుల పేరు ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తారు. పులివెందుల పేరు దుర్మార్గాలకు, దోపిడీకి అడ్రస్‌గా మారిపోయింది. మానవ హక్కులు కాలరాసిపోతున్నాయి. ఫ్యాక్షన్ గుండాలకు భయపడే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదు" అని అన్నారు.ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై పులివెందుల వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ నేతల ఫిర్యాదుపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Janasena, Pawan kalyan, Pulivendula, Tirupati Loksabha by-poll, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు