జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే రాయలసీమలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో పూర్తిగా చతికలబడ్డ జనసేనలో కొత్త ఉత్సాహం నింపాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి ఆరు రోజుల పాటు ఆయన రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. చిత్తూరు, కడప జిల్లాలో పర్యటించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు, మేధావులతో చర్చించనున్నారు. రాయలసీమ కర్నూలు మినహా మూడు జిల్లాలను కవర్ చేసే విధంగా తన టూర్ ఉండేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
అయితే రాయలసీమ టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ మళ్లీ ఓ అంశాన్ని ప్రస్తావిస్తారా అనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు రాయలసీమలో పలుసార్లు పర్యటించిన పవన్ కళ్యాణ్... తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని అప్పట్లో వ్యాఖ్యానించారు. అనంతపురంలో జరిగిన జనసేన బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన రాయలసీమలోని ఒక స్థానం, కోస్తాలోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. చిరంజీవి కూడా రాయలసీమలోని తిరుపతి, కోస్తాలోని పాలకొల్లు నుంచి పోటీ చేయడంతో... పవన్ కళ్యాణ్ కూడా కచ్చితంగా సీమలోని ఓ స్థానం నుంచి బరిలో ఉంటారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా గాజువాక, భీమవరం స్థానాల నుంచి బరిలోకి దిగారు. దీంతో రాయలసీమలోని జనసేన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తే... ఆ ప్రభావం జిల్లాలో ఎంతో కొంత కచ్చితంగా ఉండేదని జనసేన కార్యకర్తలు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. అయితే తాజాగా రాయలసీమ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేసే అంశాన్ని ప్రస్తావిస్తారా ? ఇక్కడి జనసేన కార్యకర్తలు ఈ అంశాన్ని మరోసారి ఆయన ముందుకు తీసుకెళతారా ? అనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janasena, Pawan kalyan, Rayalaseema, TDP, Ysrcp