ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న ఈ రెండు పార్టీలు..త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇంతవరకు ఎవరు పోటీ చేయాలనే అంశంపై రెండు పార్టీలు స్పష్టత రాలేదు. అభ్యర్థి ఎంపిక కోసం ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఉమ్మడిగానే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. బీజేపీ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా బీజేపీ అభ్యర్థే తిరుపతిలో పోటీ చేస్తారని ముందుగానే ప్రకటించింది. అంతా బాగానే ఉన్నా ఇటీవల తిరుపతిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తామే తిరుపతి బరిలో దిగుతున్నట్లు స్పష్టం చేశారు. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనసేనకు చిన్నపాటి షాకిచ్చారు సోము వీర్రాజు.
అలర్ట్ అయిన పవన్
బీజేపీ నేతల వైఖరితో అటు జనసేన పార్టీ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. దీని ద్వారా తాము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను బీజేపీకి ఇచ్చినట్లైంది. పార్టీ కేడర్ ను సమాయత్త పరిచేందుకు సొంత ప్రణాళికలో ముందుకెళ్తోంది. 10 మందితో కూడిన కార్యనిర్వాహక కమిటీని నియమించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరంతా పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్తారని ప్రకటించారు. కమిటీలో పి.హరిప్రసాద్, రాందాస్ చౌదరి, వినుత, ఉయ్యాల ప్రవీణ్, గూడురు వెంకటేశ్వర్లు, మనుక్రాంత్ రెడ్డి, కిరణ్ రాయల్, పొన్న యుగంధర్, తీగల చంద్రశేఖర్, కంటేపల్లి ప్రసాద్ ఉన్నారు. కమిటీని ప్రకటించడం ద్వారా బీజేపీ నేతల ముందస్తు ప్రకటనలు అడ్డుకట్ట వేయడమే జనసేన ఉద్దేశమని పార్టీ నేతలు చెబుతున్నారు.
కళ్లెం వేస్తారా..?
రాష్ట్రంలో బీజేపీ కంటే జనసేన బలంగా ఉన్నా.. ఇంతర అంశాల్లో బీజేపీనే పెద్దన్నలా వ్యవహరిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటమే దీనికి కారణం. తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఏపీలోనూ బీజేపీ యాక్టివ్ అయింది. తిరుపతిలో ఎలాగైనా గెలిచి తన ఉనికిని బలంగా చాటాలనే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జనసేన కంటే ముందుగానే గ్రౌండ్ లోకి దిగి.. ప్రకటనలు చేస్తోంది. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసి తన గ్రిప్ లో పెట్టుకునేందుకు జనసేన కూడా అదేవిధంగా ప్లాన్స్ వేస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతి కోసం ప్రత్యేకంగా కార్యనిర్వాహక కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, కార్యకర్తలను సమాయత్తం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. మఖ్యంగా ఫ్యాన్ బేస్ ను ఓటు బ్యాంకుగా మార్చాలని పవన్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఓట్ల పరంగా బీజేపీ కంటే చాలా ముందునన్న జనసేనను అదేస్థాయిలో నిలబెట్టి అభ్యర్థిత్వం సాధించాలనేది పవన్ పట్టుదలగా ఉంది.
ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా రెండు పార్టీలు ఎవరి వ్యూహాలు వారు అమలు చేసి అభ్యర్థిత్వాన్ని సాధించాలని భావిస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీలు పొత్తు రాజకీయాల్లో సొంత అజెండాలను ఎలా అమలు చేస్తాయో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Bjp-janasena, Janasena party, Pawan kalyan, Somu veerraju, Tirupati Loksabha by-poll