ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో ఎన్నిక నగారా మోగనుంది. త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఉఎన్నిక అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న మొదటి ఉపఎన్నిక కావడంతో తిరుపతిపై అందరి ఫోకస్ పడింది. మరోవైపు జగన్ సర్కార్ తీరుపై అలుపెరుగని పోరాటం చేస్తామంటున్న తెలుగుదేశం అదినేత చంద్రబాబు.. అందరికంటే ముందుగా తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించేసి పోరును రసవత్తరం చేశారు. ఐతే అభ్యర్థిగా ప్రకటించినా ఆమె మాత్రం రంగంలోకి దిగలేదు. ఇంతవరకు కార్యాచరణ మొదలుపెట్టకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది.
తిరుపతి బై ఎలక్షన్ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా చంద్రబాబే అభ్యర్థిని ప్రకటించారు. ప్రచారం కోసం ఇతర పార్టీల కంటే ఎక్కువ టైమ్ దొరికింది. కానీ పనబాక లక్ష్మి మాత్రం స్థానిక నాయకులతో చిన్న మీటింగ్ కూడా పెట్టలేదు. పనబాక లక్ష్మిగానీ ఆమె కుటుంబీకులు గానీ, అనుచరులుగానీ, కార్యకర్తలుగానీ కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఫోన్లు చేసినా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐతే తిరుపతిలో పోటీ చేయడం పనబాక లక్ష్మికి ఇష్టం లేదని తెలుస్తోంది. పనబాక బీజేపీకి వెళ్తారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు ఆమెను అభ్యర్థిగా ప్రకటించినట్లు సమాచారం. తిరుపతిలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. కానీ పనబాక లక్ష్మి మాత్రం ఎక్కడా కనిపించలేదు.
తిరుపతి లోక్సభ పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడురు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సొంత జిల్లాలో జరిగే ఉపఎన్నిక కావడంతో ఉపఎన్నికను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంతో కార్యకర్తల్లో జోష్ నింపినా... పనబాక లక్ష్మి మాత్రం షాకిచ్చేలా కనిపిస్తున్నారు.
విజయసాయి మాట నిజమవుతుందా..?
పనబాక లక్ష్మి టీడీపీకి షాకిచ్చారని... పోటీ నుంచి తప్పుకున్నారని తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ఆజ్యం పోస్టూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. నేరుగా పనబాక పేరును ప్రస్తావించకుండా ‘‘అకటా... 32 ఏళ్ల పచ్చ పార్టీకి ఇంత కష్టం వచ్చిపడిందా? తిరుపతి బైఎలక్షన్ కు అభ్యర్థి దొరకడం లేదట. టికెటిచ్చి కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడినా ఎవరూ ముందుకు రావడం లేదు'' అని ట్వీట్ చేశారు. తిరుపతి విషయంలో కాస్త ఇరకాటంలో పడ్డ టీడీపీకి పనబాక లక్ష్మి వైఖరి శరాఘాతంలా మారింది. మరి చంద్రబాబు నేడో రేపో ఉపఎన్నిక షెడ్యూల్ వస్తుంది. ఈలోగా సైకిల్ పార్టీకి లక్ష్మీ కటాక్షం దక్కుతుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, TDP, Telugu news, Tirupati, Tirupati Loksabha by-poll, Ysrcp