హోమ్ /వార్తలు /national /

ఖమ్మంలో కాంగ్రెస్ ఖాళీ.. టీఆర్ఎస్‌లోకి కొత్తగూడెం ఎమ్మెల్యే?

ఖమ్మంలో కాంగ్రెస్ ఖాళీ.. టీఆర్ఎస్‌లోకి కొత్తగూడెం ఎమ్మెల్యే?

కేటీఆర్, వనమా వెంకటేశ్వర్రావు ఫైల్

కేటీఆర్, వనమా వెంకటేశ్వర్రావు ఫైల్

హస్తం పార్టీ.. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇప్పటికే మండలిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్.. మరి కొన్ని రోజుల్లో ప్రాతినిథ్యం కూడా చేజార్చుకోబోతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఇప్పుడు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేవడం.. కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...

తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. గులాబీ బాస్ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇప్పటికే.. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తాన్ని విడిచి కారెక్కేస్తున్నారు. కీలకమైన రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కుమారుడు కార్తీక్ రెడ్డితో సహా టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సంఖ్యాబలం కూడా కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కారెక్కేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన కేటీఆర్‌ను కలిసి చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జట్టుకట్టి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం మహాకూటమికి 21 సీట్లు రాగా, అందులో కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల విజయం సాధించింది. అందులో ఎక్కువ స్థానాలు వచ్చినవి ఖమ్మం జిల్లా నుంచే కావడం విశేషం. మల్లు భట్టివిక్రమార్కతో పాటు మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఆ సంతోషం కూడా ఎక్కువ కాలం నిలువలేదు. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేగ కాంతారావు, హరిప్రియనాయక్, ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. తాజాగా, మాజీ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీలో చేరే విషయమై.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కాంగ్రెస్ కథ కంచికి చేరే పరిస్థితి నెలకొంది. ఇప్పుడా జిల్లాలో సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కతో సాటు, కోడెం వీరయ్య మాత్రమే మిగిలారు.

వనమా చేరికతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 99కి చేరనుండగా.. కాంగ్రెస్ బలం 12కు చేరనుంది. మొత్తం సభ్యుల్లో పదిశాతం సంఖ్యాబలం (12) కలిగిన కాంగ్రెస్.. ప్రతిపక్ష హోదాలో ఉంది. అయితే, ప్రస్తుతం ఆ సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండడంతో హస్తం పార్టీ.. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇప్పటికే మండలిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్.. మరి కొన్ని రోజుల్లో ప్రాతినిథ్యం కూడా చేజార్చుకోబోతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఇప్పుడు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేవడం.. కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇంకెవరు పార్టీ నుంచి జంపవుతారో తెలియక హస్తం పార్టీ సతమతమవుతోంది.

First published:

Tags: Lok Sabha Election 2019, Mahakutami, Telangana, Telangana Assembly, Telangana Election 2018, Telangana News, Trs, TS Congress

ఉత్తమ కథలు