రాష్ట్రపతి కాబోతున్నారన్న వార్తలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, రాష్ట్రపతితో పాటు ఏ పదవి ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆమోదించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
గతానికి భిన్నంగా ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తర రాజకీయ పరిణామాలకు వేదికైంది. ఈ ఏడాది జూన్-జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పేరును ప్రతిపాదించబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేలా బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థిని రాష్ట్రపతిగా పోటీలో నిలపాలని భావిస్తున్న తరుణంలో మాయకు బీజేపీనే ఉన్నత పదవి ఆఫర్ చేసిందనే లీక్ సంచలనంగా మారింది. దీనిపై మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తొందరలోనే రాష్ట్రపతి కాబోతున్నారన్న వార్తలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, రాష్ట్రపతితో పాటు ఏ పదవి ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆమోదించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ అంతమవుతుందని తెలిసినప్పుడు తాను అలాంటి(రాష్ట్రపతి) పదవికి ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించారు. బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. భవిష్యత్‌లో ఇలా తప్పుదారి పట్టించే ప్రచారం మళ్లీ జరగొచ్చని, అలాంటి వాటి ట్రాప్‌లో పడొద్దని పార్టీ కార్యకర్తలకు మాయ సూచించారు.
తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుట్ర పన్ని గెలిచిందని, తనను రాష్ట్రపతి చేస్తున్నారని నా ప్రజల్ని నమ్మించి బీజేపీ ఓట్లు దండుకుందని, బెహెన్‌జీ (సోదరి) రాష్ట్రపతి అవుతున్నారని ప్రజలు బీజేపీని గెలిపించారని మాయావతి వ్యాఖ్యానించారు. అయినా తాను ఒక్కదాన్నే రాష్ట్రపతి అయి ఏం చేయాలి? పార్టీ లక్ష్యాలకు ఇలాంటి పదవులు నప్పవు. గతంలో కాన్షీరాం తిరస్కరించారు. నేను ఆయన శిష్యురాలిని కదా.. అని మాయావతి అన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.