ఇటీవల ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల(5 State Elections) పోలింగ్ (Assembly Elections Polling) పూర్తయింది. గురువారం ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రానికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కాయనే అంశంపై స్పష్టత వస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీతో(Majority) పలు పార్టీలో ముందంజలో ఉండి, అధికార పీఠాన్ని ఖాయం చేసుకొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో(Uttara Pradesh) భాజపానే మళ్లీ సత్తా చాటింది. రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని యోగి ఆధిత్యనాథ్ దక్కించుకొన్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(BJP) చరిత్రను తిరగరాసింది. ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలవడం ఇదే మొదటి సారి. అందులోనూ భారీ మెజారిటీతో గెలుపొందడం చరిత్రాత్మకం. 2017 ఎన్నికల సమయంలో ముజఫర్‌గంజ్ అల్లర్లు ఎన్నికలపై ప్రభావం చూపాయి. 2022లో అలాంటి ఘటనలు ఏవీ చోటు చేసుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లో భాజపా భారీ విజయానికి కారణం ఒక్కటేనని క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. అదే లా అండ్ ఆర్డర్.
అభివృద్ధి, ఉద్యోగ కల్పన, వివిధ వర్గాల కోసం సంక్షేమ పథకాలు ఇవేవీ ఉత్తరప్రదేశ్‌లో భాజపాను నిలబెట్టలేదు. కేవలం లా అండ్ ఆర్డర్ అమలు మాత్రమే అధికార పీఠాన్ని భాజపాకు అందించింది. చాలా కాలంగా ఉత్తరప్రదేశ్ ప్రజలు భద్రత, రక్షణ కోసం ఎదురుచూస్తున్నారు. యోగి ఆధిత్యనాథ్ పాలన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రజలు తమ ఆనందాన్ని ఓట్ల రూపంలో చూపించారు. గతంలో మాయావతిని కూడా ఇలానే యూపీ ప్రజలు ఆదరించారు. ఆమె అప్పటి ఎన్నికల నినాదం..‘చాద్ గూండాన్ కి చత్తి పార్, మొహర్ లగావో హత్తి పార్’ ఎక్కువగా ప్రజలను ఆకర్షించింది.
2017లో యోగి ఆధిత్యనాథ్ మొదటిసారి సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఆయన చెప్పింది ఒక్కటే.. లా అండ్ ఆర్డర్‌ను కచ్చితంగా అమలు చేయాలి.. యుద్దప్రాతిపదికన ప్రతిఫలాలు అందించాలి. దీని ప్రభావం చాలా తొందరగానే యూపీలో కనిపించింది. లా అండ్ ఆర్డర్‌ను అమలు చేయడంలో తాజాగా విడుదలైన ర్యాంకింగ్‌లో భాజపాకు మొదటి స్థానం, వరుసగా బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీకి రెండు, మూడు స్థానాలు దక్కాయి. 2017లో లఖ్‌నవూలో పూర్తిగా మార్పు కనిపించిందని కొందరు చెబుతున్నారు. గతంలో చూసిన నగరానికి, 2017లో కనిపించిన నగరానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు. 2017లో అనుక్షణం గస్తీ నిర్వహిస్తూ పోలీసులు కనిపించారని గుర్తు చేసుకొన్నారు.
వ్యాపారసంస్థలు ఉన్న ప్రాంతాలు, ఫైనాన్షియల్ సెంటర్లు ఉన్న.. ఆగ్రా ఇండస్ట్రియల్ ఏరియా, సాహిబాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల ప్రజలు పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు. ఆయా కంపెనీలలో పని చేస్తున్న మహిళలు షిఫ్ట్ పూర్తి చేసుకొని వెళ్తున్న సమయంలో కచ్చితంగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసు కనిపిస్తారని చెబుతున్నారు. ల్యాండ్ కబ్జాలు కూడా చాలా వరకు తగ్గాయని, ల్యాండ్ మాఫియా కనిపించడం లేదని వ్యాపారులు తెలిపారు. ఇలాంటి మార్పులతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
రెట్టింపు వేగంతో అధికారంలోకి యోగి ఆధిత్యనాథ్
అర్బన్ సెంటర్స్‌లో నివసించే వారికి ఈ అంశం పెద్దగా పట్టకపోవచ్చు కానీ.. ఇతర ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు మార్నింగ్ వాక్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉండేవి. విద్యార్థినులు స్కూల్, కళాశాలల నుంచి అడ్మిషన్ వెనక్కి తీసుకొనే స్థాయిలో ఈవ్‌టీజింగ్ ఉండేదంటే నమ్మాలి. ఎస్పీ పరిపాలనలో దాదాపు యాసిడ్ దాడి నుంచి తప్పించుకొన్నానని ఓ విద్యార్థిని ఈ సందర్భంగా గుర్తు చేసుకొంది. ప్రస్తుతం ‘యాంటి రోమియో స్వ్కాడ్స్’ సాయంతో ఇంటి నుంచి విద్యార్థినులు ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారని వివరించారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలు కూడా భాజపా పాలనలో లా అండ్ ఆర్డర్ అమలు గురించి స్పష్టం చేస్తున్నాయి. యూపీలో యోగి ఆధిత్యనాథ్ పాలనలో రేప్‌లు 43 శాతం, హత్యలు 23 శాతం, కిడ్నాప్‌లు 19 శాతం తగ్గాయని పేర్కొంటున్నాయి. రౌడీషీటర్లు అటిక్యూ అహ్మద్, ముక్తర్ అన్సారీ, వికాస్ దూబేలను అణిచివేసిన ఘటనలు అందరికీ తెలిసినవే. యూపీ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టూ పబ్లిక్ అండ్ ప్రేవేట్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ చాలా మంది జీవితాలను రక్షించింది. కరోనా విజృంభణకు ముందు మహిళా నేరాల్లో లక్ష మందిలో 55.4 మంది మహిళపై యూపీలో నేరాలు జరిగేవి.. ఇది మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్, కేరళ కంటే తక్కువ. యూపీలో నేరగాళ్లపై యోగి ఆధిత్యనాథ్ ఉక్కుపాదం మోపడంతో సరిహద్దు రాష్ట్రాల్లోనూ నేరాలు తగ్గాయి. ఉదాహరణకు 30 ఏళ్లుగా ఉన్న సోతిగంజ్ ఇల్లీగల్ కారు విడిభాగాల మార్కెట్‌ను మూసివేయడంతో.. ఢిల్లీ-హర్యాణా-పంజాబ్-యూపీ బార్డర్‌లో కారుల దొంగతనాలు తగ్గిపోయాయి.
యూపీలోని మహిళలు ‘బాబా జి’ పాలనలో రక్షణ లభించిందని చెబుతున్నారు. సమాజ్‌వాదీ పాలనకు, భాజపా పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పాలనలో మంత్రి గాయత్రి ప్రజాపతిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదవడం గమనార్హం. బాధితులు సుప్రీం కోర్టుకు వెళ్లగా.. మంత్రిని రక్షించేందుకు దాదాపు 10 మంది డీజీపీలను అఖిలేష్ యాదవ్ మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ అనేది ఇండియా ఎన్నికల కోణంలో చాలా చిన్నది. అభివృద్ధి, సంక్షేమం మాత్రమే ముందు కనిపిస్తాయి. బంగ్లాదేశ్‌లో కూడా షేక్ హసీనా లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టి రెండో సారి అధికారంలోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Politics, Uttarapradesh, Yogi adityanath