రోహిణి స్వామి
తమిళనాడులో(Tamilanadu) అన్నాడీఎంకేని పక్కనపెట్టే స్థాయిలో బీజేపీ ప్రతిపక్షం పాత్రను నిర్వహిస్తోంది. డీఎంకే విధానాలను వీలుచిక్కినప్పుడల్లా విమర్శిస్తోంది. ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలపై కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ(BJP) భవితవ్యం, రానున్న పార్లమెంట్, శాసనసభ ఎన్నికల లక్ష్యాలను ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై న్యూస్ 18 నెట్‌వర్క్‌కు(News 18 Network) ఇచ్చిన ఇంటర్వ్యూలో(Interview) వెల్లడించారు. డీఎంకేకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ద్రవిడ సిద్ధాంతాలు, హిందూ అనుకూల వాదనలపై ఆయన ఏమన్నారో చూద్దాం.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో గమనించిన మార్పులు ఏంటి?
నేను బాధ్యతలు చేపట్టడం కంటే.. కంటిన్యుటీ ముఖ్యం. బీజేపీకి ఒక వ్యూహం ఉంది.. దాన్ని సాధించే దిశగా మేం పనిచేస్తున్నాం. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం కల్పించం. పార్టీ లక్ష్యాలు, సమష్టి నాయకత్వం ప్రధానమని భావిస్తాం. గడిచిన పది నెలల్లో డీఎంకే తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యాం. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతిని వ్యతిరేకించి నిలబడిన పార్టీ మాది. భవిష్యత్తులో డీఎంకేకు ప్రత్యామ్నాయం కాగల పార్టీ బీజేపీ.
డీఎంకేకి బీజేపీ ప్రత్యామ్నాయమని తమిళనాడు ప్రజలకు ఎలా చూపిస్తున్నారు?
బీజేపీ, డీఎంకే సిద్ధాంతాలకు పూర్తి వైరుధ్యం ఉంది. డీఎంకేలా కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సమాజంలోని ప్రతి విభాగంపై దృష్టిసారిస్తాం. మేము అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో పరిశీలిస్తే పేదలకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. ప్రజలు కోరుకొన్నవి అందిస్తున్నాం. చిట్టచివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ప్రయోజనాలను చేరవేస్తున్నాం. ఓటర్లకు చేసిన హామీల్లో ఒకటైన పొంగల్ కానుకను కూడా డీఎంకే సక్రమంగా అందజేయలేకపోయింది. సామాన్యులకు సాధికారత కల్పించడం, ప్రజాధనాన్ని అత్యంత ప్రభావవంతంగా నిర్వహించడం బీజేపీ లక్ష్యం. ప్రజలు పార్టీపై, ప్రభుత్వంపై ఆధారపడేలా చేయడం డీఎంకే పాలనా విధానం.
ALSO READ Anurag Thakur: దుబాయ్‌లో బాలీవుడ్ హీరోతో కలిసి కేంద్రమంత్రి డ్యాన్స్
తమిళనాడును డీఎంకే తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రం 6.5 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది. TASMAC నుంచి రూ.9,000 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం చూసింది. డీఎంకే ప్రకారం.. మద్యాన్ని స్వేచ్ఛగా ప్రవహించేలా చేయడమే సామాజిక న్యాయం. గుజరాత్‌లో మోదీజీ పాలనను చూడండి.. మద్యం నుంచి ఒక్క రూపాయి ఆదాయం తీసుకోకుండా ప్రభుత్వం నడిచింది. మిగులు బడ్జెట్‌ను కూడా చూపింది. భవిష్యత్తులో డీఎంకే- బీజేపీల మధ్య విభేదాలు తప్పవు.
తమిళనాడు ద్రవిడ భావజాలానికి ప్రాధాన్యమిచ్చే రాష్ట్రం. ఇక్కడ బీజేపీ ప్రధాన శక్తిగా మారగలదని ఎలా అనుకుంటున్నారు?
ద్రావిడ భావజాలం అంటూ ఏమీ లేదు. ద్రావిడ అభివృద్ధి నమూనా ఏమిటని సీఎం స్టాలిన్‌ని ప్రశ్నిస్తూనే ఉన్నాను. బీజేపీని రాష్ట్రంలో కలుపుకొని పోవడం లేదా? డీఎంకే అందరినీ కలుపుకుపోతే ఆ ఒక్క కుటుంబం పార్టీని ఎలా నడుపుతోంది? తమిళనాడులో డీఎంకేపై ఆధిపత్యం చెలాయించే 44 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలోని రెండు మూడు తరాలు అధికారం చెలాయిస్తున్నాయి. దీన్నే వారు ద్రావిడ నమూనా అని పిలిచారా? దీన్ని గోపాలపురం మోడల్ లేదా డీఎంకే మోడల్ అని పిలవాలి. ద్రవిడ ప్రపంచాన్ని డీఎంకే యాజమాన్యం అంగీకరించదు. ఈ భూమిపై ఉన్న వారెవరైనా న్యాయంగా ద్రావిడులేనని నమ్ముతున్నాం. ఈ అంశాలను డీఎంకేకి స్పష్టం చేస్తాం.
ద్రావిడవాదాన్ని, ద్రావిడవాదంతో బీజేపీకి ఉన్న సంబంధాన్ని ఎలా నిర్వచిస్తారు?
ద్రావిడవాదం అంటే అందరినీ తమ వెంట తీసుకెళ్లి సామాజిక న్యాయం చేయడమే. ఇది బ్రాహ్మణులను కొట్టడం, ఓబీసీని కొట్టడం లేదా హిందూ వ్యతిరేకత గురించి కాదు. ద్రావిడవాదం అనేది 350 సంవత్సరాలకు పైగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారత అందజేయడమే లక్ష్యం. తమిళనాడు 1967 వరకు పండితులను, పరిశోధకులను, స్వాతంత్య్ర సమరయోధులను తయారు చేసింది.
ఇటీవల పట్టణ సంస్థల ఎన్నికలలో అన్నాడీఎంకే నుంచి విడిపోయారు. ఒంటరిగా పోటీ చేసిన తర్వాత బీజేపీ పనితీరును ఎలా అంచనా వేస్తారు?
ఏ పార్టీకైనా అది ఎదగడానికి అవకాశం రావడమే చట్టబద్ధమైన పరీక్ష. పట్టణ సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని తీసుకెళ్లడానికి బీజేపీకి గొప్ప అవకాశం దొరికింది. మా పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసిన 5000 మందిని తర్వాత తరం యువ నాయకులుగా గుర్తించాం. ఉనికి లేని స్థానాల్లో పార్టీ గెలుపొందగలిగింది. ఓట్ల శాతం పరంగా మేము ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించాం. ఇది ప్రారంభం మాత్రమే.. ఇక్కడి నుంచి బలోపేతం అవుతాం.
ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఏమవుతుందని అనుకొంటున్నారు?
మా రాజకీయ భాగస్వాములందరూ చక్కగా పని చేస్తారని నమ్ముతున్నాను. ఇది రాష్ట్రానికి మేలు చేస్తుంది. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీని ఎదగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాను. పార్టీ క్యాడర్‌ను పెంచడమే నా ముందున్న కర్తవ్యం.
రాజకీయాల్లో శశికళకు భవిష్యత్తు ఉందా? టీటీవీ దినకరన్, శశికళను మళ్లీ అన్నాడీఎంకేలోకి తీసుకునే అవకాశంపై మీ అభిప్రాయం?
తమిళనాడులోని 8.5 కోట్ల మంది ప్రజలకు రాజకీయాల్లో భవిష్యత్తు ఉందని నేను భావిస్తున్నాను. ఎన్నికల్లో ఎవరైనా వచ్చి పోటీ చేయవచ్చు. తమిళనాడు ప్రజలు తమ కోసం పనిచేసే వారిని ఇష్టపడతారు, వారి హక్కులు, అవసరాల కోసం పోరాడతారు. వారికి సేవ చేస్తారు. ఇలా చేయాలనుకునే ఎవరికైనా తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుంది. అన్నాడీఎంకే పార్టీలో ఏమి జరుగుతుందో నేను వ్యాఖ్యానించదలచుకోలేదు.
తమిళనాడులో మత మార్పిడి నిరోధక చట్టం ఉందని మీరు అనుకుంటున్నారా?
మతమార్పిడి నిరోధక చట్టం, బలవంతపు మార్పిడి చట్టం మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఎవరినీ ఏ విధంగానూ బలవంతం చేయలేరు. వారు పుట్టిన మతం నుంచి వారిని మార్చడానికి ప్రయత్నించలేరు. వారు రెండు రకాల అపచారాలకు పాల్పడుతున్నారు. ఒకటి వారు పుట్టిన మతానికి , రెండోది ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న కొత్త మతానికి. ఏ రకమైన బలవంతపు మతమార్పిడి అయినా ఖండించదగినది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లను లక్ష్యంగా పెట్టుకొన్నారు?
ఒక పార్టీగా మేము సంఖ్యలను లక్ష్యాలుగా ఎంచుకోం. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలను మోదీజీ మంత్రివర్గంలోకి పంపడం నా బాధ్యతగా తీసుకుంటాను. మోదీ తమిళనాడు ప్రజల కోసం చాలా చేశారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు సజావుగా రావాలి. ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు రూ.7.5 లక్షల కోట్లు వచ్చాయి. తమిళనాడు ప్రజలు మెరుగైన పాలనకు అర్హులు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 150 నియోజకవర్గాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పని చేస్తాం.
కమల్ హాసన్ రాజకీయ భవిష్యత్తుపై ఏం చెప్తారు?
చాలా మంది సభ్యులు కమల్ హాసన్ పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరారు. ప్రజలు ఆయనకు రెండు అవకాశాలు ఇచ్చారు. పార్టీ ప్రజల కోసం పెట్టలేదని వారు తర్వాత గ్రహించారు. రాజకీయాలలో, ఎంఎన్‌ఎంలో తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఆయనదే. ఇటీవల జరిగిన అర్బన్ బాడీ ఎన్నికలను పరిశీలిస్తే.. ఒక్క చోట కూడా బీజేపీకి ఎంఎన్‌ఎం దగ్గరగా రాలేదు. కమల్ హాసన్ మోదీజీని, బీజేపీని ఎదిరించినంత మాత్రాన ఓట్లు రాలవు.
హిందూ అనుకూల ట్యాగ్‌ని బీజేపీ తొలగించుకోగలదా?
ప్రజలు ఇవన్నీ నమ్మరు. అలాంటి ఆరోపణలను ప్రచారం చేయడానికి తమ సొంత టెలివిజన్ ఛానెల్‌లను ఉపయోగించుకునే పార్టీలు ఉండవచ్చు. అవి ఓట్లుగా మారవు. ప్రజలు ఆ ఆరోపణలను పట్టించుకోరు. బీజేపీ సూత్రాలను ప్రజలు నెమ్మదిగా అంగీకరిస్తున్నారని అందరికీ అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.