విజయనగరం జిల్లా రామతీర్థం ఎపిసోడ్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకేరోజు ఇటు టీడీపీ అదినేత చంద్రబాబు, అటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ఘటనకు చంద్రబాబు చేసిన కుట్రే కారణమని విజయసాయి రెడ్డి ఆరోపిస్తే.. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం దారుణమని చంద్రబాబు అన్నారు. ఆలయాలను పరిరక్షించే బాధ్యత సీఎం జగన్ కు లేదా అని ప్రశ్నించారు. రామతీర్థం, ఒంటిమిట్ట ఆలయాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందని.., 16వ శతాబ్దంలోనే పూసపాటి వంశీయులు రామతీర్థంలో ఆలయాలను నిర్మించారని చంద్రబాబు గుర్తు చేశారు. విగ్రహాలను ధ్వంసానికి పాల్పడిన వారు పరమ కిరాతకులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అతి చేస్తే అధికారులు జాగ్రత్త..
దేవుడి ఆస్తులపై కన్నేస్తే మసైపోతారన్నారు. దేవాలయాల వద్దకు వెళ్లి అన్యమత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో పరమత విద్వేషం ఎందుకు? రాష్ట్రంలో హోంశాఖ, దేవాదాయశాఖ మంత్రులు ఉన్నారా? ఉంటే ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక కొందరు పోలీసులు అతిగ ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రామతీర్థంలో విజయసాయి రెడ్డికి ఏం పనని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డిని కొండపైకి అనుమతించిన పోలీసులు... తననెందుకు అడ్డుకున్నారని నిలదీశారు. విజయసాయి రెడ్డి లాంటి నాయకులను నా జీవితంలో చాలా మందిని చూశానని బాబు పేర్కొన్నారు. రామతీర్థం ఘటనపై స్థానిక ఆర్డీవో, తహసీల్దార్‌కు బాధ్యత లేదా? విగ్రహాల ధ్వంసం విషయంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అశోక్ గజపతి రాజును ఆలయాల ట్రస్ట్ బోర్డుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ పాపం ఊరికే పోదని.. సీఎం జగన్ కు కోర్టుల్లో నిలబడే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు.
చిత్రగుప్తుడి చిట్టా సిద్ధం : అచ్చెన్న
రామతీర్థం ఘటనలో పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు. కొంత మంది పోలీసులు సీఎం జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం, ధర్మం అంటూ రాజకీయం చేసే రోజులు పోయాయన్నారు. మరో రెండేళ్లలో చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోతున్నారని.. అప్పుడు పార్టీ కార్యకర్తలందరికీ లైసెన్స్ ఇచ్చేస్తామన్నారు. పోలీసులు చేస్తున్న తప్పులపై చిత్రగుప్తుడి చిట్టా రెడీ అయిందని ఒక్కర్న కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు.
మరోవైపు రామతీర్థం ఎపిసోడ్ లో టీడీపీ, వైసీపీ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆలయాలపై మాట్లాడే అర్హత అధికార, ప్రతిపక్షాలకు లేదన్నారు. రెండు పార్టీలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తునన్యని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఆలయాలు కూల్చితే.., వైసీపీ హయాంలో హిందూ ధర్మ అవమానాలకు గురవుతోందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, Chandrababu naidu, Kinjarapu Atchannaidu, Somu veerraju, Tdp, Vijayasai reddy, Ysrcp