ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫ్లెక్సీల కలకలం రేగింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. ముద్రగడ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ముద్రగడ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్త జిల్లా అంతటా వ్యాపించింది. ఈ విషయం ముద్రగడ వరకు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై సీరియస్ అయ్యారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే కాకినాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందున అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు ముద్రగడకు సూచించారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై మాట్లాడిన ముద్రగడ పద్మనాభం.. తన ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించేందుకు కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని నడిపించిన ముద్రగడ పద్మనాభం ఇటీవలే కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనసవర నిందలు, ఆరోపణలకు తోడు తనను కులద్రోహిగా ముద్రవేశారంటూ ప్రచారం ఆయన ఉద్యమం నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఏ అంశం మీద స్పందించడం గానీ, మీడియాతో మాట్లాడటం గానీ జరగలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ఫ్లెక్సీలు కనిపించడంతో ఆయన అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి తెరలేపారు. చలో తునికి పిలుపునిచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అదే సమయంలో ఆందోళన కారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం చేయడంతో కాపు రిజర్వేషన్ల అంశం సంచలనం సృష్టించింది. అప్పట్లో కాపు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అప్పటి టీడీపీ, వైసీపీలు తీవ్రంగా యత్నించాయి. ఈ నేపథ్యంలోనే కాపుల అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పది శాతం రిజర్వేషన్‌లో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టిన తెలుగుదేశం పార్టీ సేఫ్ గేమ్ ఆడగా, రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని., తమ లల్ల కాదంటూ వైసీపీ తేల్చి చెపేపేసింది. ఫలితంగా కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం గత ఎన్నికల్లో టీడీపీని అధికారం నుంచి దూరం చేయగా, వైసీపీకి ఊహించని విజయాన్ని అందించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, కాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కన పెట్టింది. ఆ తర్వాత ఆయన ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
కాపు ఉద్యమానికి గుడ్ బై చెప్పిన తర్వాత ముద్రగడ వైసీపీలో గానీ బీజేపీలో గానీ చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే ఉద్యమం నుంచి తప్పుకున్న ఆయన రాజకీయంగా మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో ముద్రగడ గానీ.., ఆయన వారసులుగానీ రాజకీయాల్లోకి వస్తారంటూ వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, East Godavari Dist, Kakinada, Kapu Reservation, Mudragada Padmanabham