దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ ప్రతిపక్షల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.ఎన్నికల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడంతో దానిపై ఆందోళనలకు సిద్దమయ్యారు. ముఖ్యంగా దళిత బంధుపై నిప్పులు చెరుగుతున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ అంశంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈనేపథ్యంలోనే తన నియోజకర్గానికి రెండు వేల కోట్లు దళిత బంధు పథకం క్రింద మంజూరు చేస్తే తాను రాజీనామా చేసి ఆ సీటును టీఆర్ఎస్కు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తన నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేయాలని ఆందోళనకు దిగారు. నేడు తన అనుచరులతో కలిసి నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌లో ధర్నా చేసేందుకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నిరసన కార్యక్రమానికి బయలు దేరిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు.
ఆయన్ను ఆరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాష్ట్రంలో తిరగనిస్తామని హెచ్చరించారు. ఇందుకోసం దళితులు అందరు ఏకం కావాలని పిలుపునిచ్చారు. దళితులను మోసం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నారని ఆరోపణలు చేశారు.
కాగా రాజగోపాల్ రెడ్డి ఇటివల ప్రభుత్వ కార్యాక్రమాలపై పలు విమర్శలను ఎక్కుపెట్టారు. ఈనేపథ్యంలోనే నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఏకంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న మైకును గుంజుకున్నారు. దీంతో ఆయనపై చౌటుప్పల్ పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.