సెప్టెంబర్ 24 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టాలని పశుసంవర్థక,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా.. ఫంక్షన్‌హాల్స్, కమ్యూనిటీహాల్స్ వంటి చోట్ల చీరల పంపిణీ చేపట్టాలన్నారు.18 సంవత్సరాలు దాటి,తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలన్నారు. గ్రేటర్లో 15.40 లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 4.20 లక్షల చీరలు జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. మొత్తం 10 రంగుల్లో 10 డిజైన్లతో చీరలను తయారు చేయించినట్టు చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.02 కోట్ల చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు.శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో బతుకమ్మ చీరల పంపిణీపై నిర్వహించిన సమావేశంలో తలసాని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, హోంమంత్రి మహమూద్‌అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.