జమిలి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. పార్టీ శ్రేణులు అందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఓడిన డివిజన్లలో పోటి చేసిన అభ్యర్థులను పక్కకు పెట్టకుండా అందరు కలిసి పనిచేయాలని సూచించారు. సిట్టింగ్‌లను మార్చిన చోట జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. సిట్టింగ్‌లను మార్చని చాలా చోట్ల ఓడిపోయాని అన్నారు. ఇక్కడే టీఆర్‌ఎస్ లెక్క తప్పిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
కేంద్రం జమిలి ఎన్నికల విషయంలో ముందుకు వెళ్తుంది.. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికలను గుణపాఠంగా తీసుకుని.. లోటుపాట్లను సరిదిద్దుకోని ముందుకు సాగాలని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తే సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఇక, టీఆర్‌ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. రైతులు డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ప్రదర్శిస్తున్న పోరాట పటిమను కొనియాడారు. పోరాటం చేస్తున్న రైతులకు సీఎం కేసీఆర్ సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారన్నారు. రైతుల పోరాటానికి సెల్యూట్ చేస్తూ.. ఎల్లుండి జరిగే భారత్ బంద్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad - GHMC Elections 2020, KTR, Trs