ప్రభుత్వ విధులు, రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి అనిల్ కుమార్ సరదాగా క్రికెట్ ఆడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఈ పైర్ బ్రాండ్.. గ్రౌండ్లో దిగి బ్యాట్‌తో విరుచుకుపడ్డారు. ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్‌లా హిట్టింగ్ షాట్లు కొట్టి క్రీడాకారులను అలరించారు. మంత్రి అనిల్ కుమార్ రాజమండ్రిలో క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించారు. టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి డిసెంబరు 31 వరకు టోర్నమెంట్ జరుగుతుంది. 18 రోజుల పాటు మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
క్రికెట్ టోర్నీని ప్రారంభించిన అనంతరం మంత్రి అనిల్ కుమార్ సరదాగా బ్యాటింగ్ చేశారు. యువకులు వేసిన బంతులను క్రీజు నుంచి ముందుకొచ్చి షాట్లు ఆడారు. బంతి బంతినీ గాల్లోకి పంపించి అందరినీ ఆలరించారు. మంత్రి అనిల్ కుమార్ బ్యాటింగ్ చూసి అక్కడున్న క్రీడాకారులతో పాటు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఫిదా అయింది. మంత్రి అనిల్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారన్నది పక్కనబెట్టి.. క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని క్రికెటర్లకు సూచించారు. డిసెంబరు 21న సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పారు. భగవంతుడి ఆశీస్సులతో సీఎం జగన్ నిండు నూరేళ్లు బాగుండాలని ఆకాంక్షించారు మంత్రి అనిల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Payal Rajput