అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ పంజాబ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శనివారం నాడు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవత్ మాన్, అధికార కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తరదితురులూ ఇవాళ నామినేషన్లు వేశారు. కాగా, అమృత్ సర్ (ఈస్ట్) స్థానంలో తన ప్రత్యర్థి, శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజీతియాను ఉద్దేశించి సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలివి..
అమృత్ సర్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ స్థానంలో తన ప్రత్యర్థి, అకాలీ దళ్ నేత మజీతియాను డ్రైవర్ గా అభివర్ణిచారు సిద్దూ. ‘మజీతియా నా డ్రైవర్ లాంటోడు. అతను నాకు పోటీనే కాదు’అని మాజీ క్రికెటర్ నోటి దురుసు ప్రదర్శించారు. అంతేకాదు, రెండు సీట్లలో కాకుండా దమ్ముంటే అమృత్సర్ ఈస్ట్ నియోజవర్గంలో మాత్రమే తనపై పోటీ చేయాలని కూడా మజీతియాకు సవాలు విసిరారు.
మజీతియాను అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గంతో పాటు పొరుగున ఉన్న మజిథా నుంచి కూడా పోటీలోకి దింపాలని అకాలీదళ్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధూ మాట్లాడుతూ, మజీతియా పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అది ఆయన ప్రజాస్వామిక హక్కు అని, అయితే, హోరాహోరీ యుద్ధంగా భావిస్తే మాత్రం ఆయన మజిథా నియోజకవర్గం వదిలి ఒక్క అమృత్సర్ ఈస్ట్ నుంచే తనపై పోటీకి దిగాలని సిద్దూ సవాలు చేశారు. మజీతియా గతంలో 2007,2012,2017 ఎన్నికల్లో మజిథా నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇక,
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ కూడా శనివారం ధురి నియోజకవర్గం నుంచి నామినేసన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాన్యుల సమస్యలను ఆప్ పరిష్కరిస్తుందని, పంజాబ్ ను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ధురి ప్రజలు తనను ఆదరిస్తారని, భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్లో చరిత్ర సృష్టించవలసిన సమయం ఆసన్నమైందని, ఆప్ జయకేతనం ఎగురవేయబోందని మాన్ వ్యాఖ్యానించారు. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.