మహారాష్ట్ర (Maharashtra)రాజకీయాల్లో మరో సంక్షోభం తలెత్తనుందా? మహావికాస్ అగాధి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి, బీజేపీ మద్దతుతో సీఎం గద్దెనెక్కిన ఏక్‌నాథ్ షిండేది (Eknath Shinde) మూన్నాళ్ల ముచ్చటేనా? మధ్యంతర ఎన్నికలతోనే డ్రామా ముగుస్తుందా? అనే అవుననే అంటున్నారు ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్ (Sharad Pawar). రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ తన పార్టీ శ్రేణులకు పవార్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం నాడు అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో 164-99 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టిన ఆయన.. వచ్చేవారం సుప్రీంకోర్టు వెల్లడించనున్న తీర్పుకోసమూ ఎదురుచూస్తున్నారు. శివసేన పార్టీ మొత్తంగా ఉద్ధవ్ ఠాక్రేకు చెందాలా? షిండే వర్గానిదేనా? అనే వివాదంపై సుప్రీంకోర్టు ఈనెల 11న విచారించనుంది. వివాదంలో షిండే వర్గానికే టెక్నికల్ ఎడ్జ్ ఉండటంతో ఉద్ధవ్ త్వరలోనే సేన లేని శివసేనానిగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బీజేపీ-శివసేన రెబల్ వర్గం పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం ఆరు నెలలకు మించి మనలేదని పవార్ వ్యాఖ్యానించారు.
క్యాబినెట్ కూర్పు తర్వాత శివసేన రెబల్స్ లో చాలా మంది సీఎం షిండేపై తిరుగుబాటు చేస్తారని, నిజానికి షిండేకు మద్దతు పలికిన రెబల్స్‌లో అనేక మందికి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇష్టం లేదని, క్యాబినెట్ విస్తరణతో వారిలో అసంతృప్తి బయటకు వస్తుందని జోస్యం చెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఆరు నెలల్లోపే మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు తప్పవని, అందుకోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులతో పవార్ అన్నారు.
ఇదిలా ఉంటే, సోమవారం నాటి బలపరీక్షలో ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షిండే సర్కారుకు వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 99 ఓట్లు షిండేకు వ్యతిరేకంగా పడగా, సభకు హాజరైన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో షిండే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. శివసేన కకావికలం అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగానే కొనసాగుతున్న దరిమిలా అజిత్ పవార్ ప్రతిపక్ష నేతగా ఎన్నికవుతారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eknath Shinde, Maharashtra, Sharad Pawar, Shiv Sena