POLITICS MAHARASHTRA POLITICAL CRISIS UPDATES 20 REBELS IN TOUCH WITH UDDHAV 15 REBELS GET Y SECURITY RASHMI THACKERAY STEPS INTO GAME MKS
Maharashtra Crisis : రంగంలోకి రష్మి ఠాక్రే.. షిండేకు షాక్.. మహా డ్రామాలో భారీ ట్విస్ట్..
మహా సీఎం ఉద్ధవ్ సతీమణి రష్మి ఠాక్రే (పాత ఫొటో)
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుబాటు చేసిన మంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు తిరిగి సీఎంతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రష్మీ ఠాక్రే రంగంలోకి దిగిన కొద్ది గంటలకే మహా సీన్ మారడం గమనార్హం.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మహా వికాస్ అగాధి కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలకు దారి తీసిన శివసేన అంతర్గత కుమ్ములాట కీలక మలుపు తిరిగింది. ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)పై తిరుబాటు చేసిన మంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) వర్గంలోని ఎమ్మెల్యేలు తిరిగి సీఎంతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షిండే వర్గం ఎమ్మెల్యేలు 36 మంది గువాహటి (అస్సాం)లోని రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేయగా, అందులో 20 మంది రెబల్స్ సీఎంతో సయోధ్యకు అంగీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఉద్ధవ్ సతీమణి రష్మీ ఠాక్రే రంగంలోకి దిగిన కొద్ది గంటలకే మహా సీన్ మారడం గమనార్హం.
రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ముంబై సహా మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన ఆందోళనలను ఉధృతం చేయడం, ఎక్కడికక్కడ రెబల్ ఎమ్మెల్యేల ఆఫీసులు, ఇళ్లపై దాడులకు దిగుతోన్న క్రమంలో వారు సీఎంతో సయోధ్యకు సిద్ధమైనట్లు తెలిసింది. సీఎం ఉద్ధవ్ సతీమణి రష్మి ఠాక్రే రంగంలోకి దిగిన కొద్ది గంటలకే మహా సంక్షోభంలో సీన్ మారిపోవడం గమనార్హం. రష్మి వ్యక్తిగతంగా రెబల్ ఎమ్మెల్యేల భార్యలు, కుటుంబీకులతో చర్చలు జరిపారని, భర్తలు తిరిగొచ్చేలా రెబల్స్ భార్యలకు రష్మి నచ్చచెప్పారని తెలుస్తోంది.
షిండే వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై శివసైనికులు శనివారం నుంచి దాడులు చేస్తున్నారు. ఆదివారం కూడా పలు పట్టణాల్లో రెబల్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. షిండే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేల చిత్రపటాలను చెప్పులతో కొడుతూ ఊరేగించారు శివసైనికులు. ఈ క్రమంలో 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసుల వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి కేంద్ర పోలీసుల పహారా కొనసాగుతున్నది. కేంద్రం భద్రత పొందిన రెబల్స్ జాబితాలో మంత్రి షిండే కూడా ఉన్నారు.
తిరుగుబాటు చేసినవాళ్లు ముమ్మాటికీ ద్రోహులేనని, ఇవాళ కాకుంటే రేపైనా వారు మూల్యం చెల్లించుకోక తప్పదని యువసేన నేత, మంత్రి ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు. రెబల్స్ కు వ్యతిరేకంగా ముంబైలో నిర్వహించిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు ముంబై వస్తే శివ సైనికుల సత్తా ఏంటో చూపిస్తామని ధమ్కీ ఇచ్చారు.
రెబల్ ఎమ్మెల్యేలు టచ్ లోకి రాకముందు.. వారిని పదవులు తొలగించాలంటూ సీఎం ఉద్ధవ్ గవర్నర్‌కు లేఖ రాయాలని భావించారు. గవర్నర్ కోశ్యారీ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, రాజ్ భవన్ చేరుకున్నారు. అయితే డాక్టర్ల సూచన మేరకు మరికొన్ని రోజులు తాను విశ్రాంతి తీసుకుంటానని, తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలని గవర్నర్ కోశ్యారీ ఓ ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటే, ఏక్ నాథ్ షిండే వర్గం ‘శివసేన బాల్ ఠాక్రే’ పేరుతో కొత్త పార్టీ పెట్టాడానికి నిర్ణయించుకోగా, శనివారం జరిగిన శివసేన జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో సీఎం ఉద్ధవ్ నేతృత్వంలో కీలక తీర్మానాలు చేశారు. షిండే వర్గం శివసేన లేదా బాల్ ఠాక్రే పేరును వాడకుండా ఉండేలా ఎన్నికల సంఘానికి తీర్మానాలు పంపారు. అదే సమయంలో శాసనసభా పక్ష నేతగా అజోయ్ చౌదరిని డిప్యూటీ స్పీకర్ అపాయింట్ చేయడాన్ని సవాల్ చేస్తూ షిండే క్యాంప్ సుప్రీం కోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ వర్గం డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాయగా, ఆ మేరకు స్పందించిన స్పీకర్ కార్యాలయం.. అనర్హత అభ్యర్థనపై జూన్ 27లోగా సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. అయితే.. అనర్హత పిటిషన్‌పై స్పందించేందుకు తమకు వారం గడువు కావాలని కోరాలని షిండే క్యాంప్ నిర్ణయించింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. మహారాష్ట్రలో సంక్షోభం ఎలాంటి మలుపు తిరుగుతందోనని సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది..
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.