ప్రజాస్వామ్య పండుగ దిగ్విజయంగా ముగిసింది. సార్వత్రిక సమరం పేరుతో మూడు నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మహా ఘట్టానికి నిన్నటితో తెరపడింది. ఈ పోరులో కొందరు విజేతలుగా నిలవగా, ఎందరో పరాజయం చవి చూశారు. ప్రజలు పట్టం కట్టిన వాళ్లు చట్ట సభల్లో అడుగు పెట్టనున్నారు. అయితే, చట్టసభల్లో అడుగు పెట్టేవాళ్లంతా ప్రజలు పూర్తిగా ఆమోదించిన వారేం కాదు. ఏ పార్టీ అభ్యర్థి నచ్చక ఓటు వేసిన వారూ ఉన్నారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో ఏ అభ్యర్థి నచ్చక నోటాకు ఓటు వేసిన వారు ఎంత మందో తెలుసా.. 45,595 మంది. ఇది గత ఎన్నికలతో పోల్చితే 6,227 ఎక్కువ. 2014 ఎన్నికల్లో నోటాకు 39,368 ఓట్లు పడ్డాయి. రాజకీయాలు, రాజకీయ నేతల పట్ల ఢిల్లీ ప్రజల్లో విముఖత పెరుగుతోందని చెప్పడానికి ఇది తార్కాణంగా తెలుస్తోంది. గతంలో మార్పును కోరుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 7 సీట్లలో ఒక్క సీటూ గెలుచుకోలేకపోవడం గమనార్హం. దేశ రాజధానిలో నోటా ఓట్లు పెరుగుతుండటం ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురి చేస్తోంది.
కాగా, నోటా ఓటు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.