దేవభూమి ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీసీ) దివంగత జనరల్ బిపిన్ రావత్ (General Bipin Rawat) సోదరుడైన ఆర్మీ మాజీ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో విజయ్ రావత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను బీజేపీలో చేరే అంశం, కుటుంబ నేపథ్యం, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోన్న క్రమంలో దేశ సేవకులుగా పేరుపొందిన రావత్ కుటుంబీకుల చేరిక బీజేపీకి కలిసొస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కుటుంబం తరతరాలుగా ఆర్మీలో కొనసాగుతూ దేశ సేవలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. రావత్ అంచెలంచెలుగా ఎదుగుతూ తివిధ దళాల్లోనే అత్యున్నత పదవిని చేపట్టగా, ఆయన చిన్న తమ్ముడైన విజయ్ రావత్ ఆర్మీలో కల్నల్ గా రిటైరయ్యారు. గతేడాది డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతోపాటు మొత్తం 14మంది దుర్మరణం చెందారు. రావత్ మరణం సందర్భంలో ఆయనకు బీజేపీతో సంబంధాలపై కొన్ని ఆరోపణలు రావడం, అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురిపై కేసులు నమోదు కావడం తెలిసిందే.
దివంత జనరల్ బిపిన్ రావత్ సోదరుడు మాజీ కల్నల్ విజయ్ రావత్ బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామితో భేటీ అయ్యారు. ఈ సమావేశం తాలూకు ఫొటోను సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. భేటీ తర్వాత విజయ్ రావత్ పలు జాతీయ మీడియా చానెళ్లతో మాట్లాడారు. అతి త్వరలోనే డెహ్రాడూన్(ఉత్తరాఖండ్ రాజధాని) వేదికగా అధికారికంగా బీజేపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
‘బీజేపీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, మా కుటుంబం భావజాలం బీజేపీ భావజాలం ఒక్కటే. పార్టీ అవకాశం కల్పిస్తే ప్రస్తుత ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతాను’అని విజయ్ రావత్ చెప్పినట్లు ఆజ్ తక్ పేర్కొంది. మొత్తం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. రావత్ చేరికతో బీజేపీకి లబ్ది చేకూరుతుందా, లేదా అనేది మార్చి 10న వెలువడే ఫలితాల్లో తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assembly Election 2022, Bipin Rawat, Bjp, Uttarakhand