బీహార్‌లో లాలూ వారసుల మధ్య అంతర్గత పోరు ముదురుతోంది. తేజస్వీ యాదవ్ ఆర్జేడీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అన్న తేజ్ ప్రతాప్ యాదవ్‌తో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెర పైకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆర్జేడీ విద్యార్థి విభాగం అధ్యక్ష పదవికి కూడా తేజ్ ప్రతాప్ రాజీనామా చేశారు. తాజాగా లోక్‌సభ సీట్ల కేటాయింపు విషయంలో అన్నాదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి.. అన్న తేజ్ ప్రతాప్ ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని తేజస్వీ మరో అభ్యర్థిని ప్రకటించారు.
జహనాబాద్ లోక్‌సభ సీటును తన సన్నిహితుడైన చంద్ర ప్రకాశ్‌కు ఇవ్వాలని తేజ్ ప్రతాప్ ముందుగానే సూచించారు. అయితే తేజస్వీ యాదవ్ మాత్రం సోదరుడి ప్రతిపాదనను తోసిరాజని సురేంద్ర యాదవ్‌కు టికెట్ కేటాయించారు. ఈ పరిణామంతో తీవ్రంగా నొచ్చుకున్న తేజ్‌ప్రతాప్.. చంద్ర ప్రకాశ్‌ను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు. జహనాబాద్ నుంచి అతను బరిలో ఉంటాడని తెలిపారు.
షివోహర్ లోక్‌సభ స్థానాన్ని కూడా తన సన్నిహితుడు అంగేష్ సింగ్‌కు కేటాయించాలని ఇదివరకే తేజ్ ప్రతాప్ యాదవ్ సోదరుడిని కోరాడు. జహనాబాద్ సీటు విషయంలో సోదరుడి ప్రతిపాదనను పట్టించుకోని తేజస్వీ.. షివోహర్ సీటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇక్కడ కూడా అన్న అభీష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థిని ప్రకటిస్తే.. తేజస్వీ యాదవ్ తన అనుచరుడు అంగేష్ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అన్నాదమ్ముల మధ్య అంతర్గత పోరు చివరకు పార్టీకి ఎక్కడ నష్టం చేస్తుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ పొత్తుతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆర్జేడీ 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 11 స్థానాలను కూటమిలోని చిన్న పార్టీలకు కేటాయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar Lok Sabha Elections 2019, Lalu Prasad Yadav, Lok Sabha Election 2019