తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పించారు. ఈసారి తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటిచ్చారు. కేటీఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్, ఐటీ, పరిశ్రమల శాఖలు అప్పగించారు. హరీశ్ రావు గతంలో భారీ నీటిపారుదల శాఖలను నిర్వహించగా, ప్రస్తుతం ఆర్థిక శాఖను అప్పగించారు. రేపు బడ్జెట్‌ను కూడా హరీశ్ రావే ప్రవేశపెట్టనున్నారు. అయితే, కొడుకు, మేనల్లుడికి కేబినెట్ బెర్త్‌లు ఇచ్చిన కేసీఆర్ మరి కుమార్తెకు ఎలాంటి అవకాశం ఇస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం కవితకు ఎలాంటి పదవీ లేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత ఆమెకు రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలిగా చేస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి కవితను పోటీచేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, తాను ఓడిపోయినా నిజామాబాద్‌లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లబోనని కవిత స్పష్టం చేశారు. తాజాగా కేబినెట్ విస్తరణలో కూడా ఆమెకు మంత్రిపదవి దక్కలేదు. అంటే ఆమెను ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ పంపే అవకాశం లేదు.
ప్రస్తుతం కేటీఆర్ మంత్రి అయ్యారు. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఉంది. అయితే, ఇప్పుడు చెల్లెలి కోసం అన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి త్యాగం చేస్తారా? లేకపోతే కేసీఆర్ మరో పదవిని క్రియేట్ చేసి ఆమెకు కట్టబెడతారా? లేకపోతే రాజ్యసభకు పంపుతారా? అనేది టీఆర్ఎస్ వర్గాలకు వేధిస్తున్న ప్రశ్న. 2020 ఏప్రిల్‌లో ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. సంఖ్యాబలం ప్రకారం ఆ రెండు పదవులూ టీఆర్ఎస్ పార్టీకే దక్కనున్నాయి. కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందనేది సస్పెన్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kalvakuntla Kavitha, Telangana, Trs