ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలతో నిరుద్యోగులు, ఉద్యోగులు కష్టాల్లో పడ్డారని వరంగల్‌లో ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెనం మీద ఉంటే... ఉద్యోగులు పొయ్యిలో ఉన్నారని కోదండరామ్ ధ్వజమెత్తారు. ఉద్యోగులు పని భారంతో ఇబ్బందిపడుతున్నారని.. వెట్టి కార్మికులుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. వారి మద్దతు కోరుతున్నామని కోదండరామ్ తెలిపారు.
తెలంగాణ సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నామని.. అందుకే కొట్లాడగలుగుతున్నామని అన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతు కూడగడతామని కోదండరామ్ తెలిపారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టుభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగాలని కోదండరామ్ కొద్దిరోజుల క్రితమే నిర్ణయించారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరామ్ భావించినా... పలు కారణాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు కోదండరామ్ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ఆయన ఈ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలో దింపుతుందా లేక కోదండరామ్‌కు మద్దతు ఇస్తుందా అన్నది మాత్రం ఇంకా తేలలేదు.
ఈ అంశంపై పార్టీపరంగా ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ తెలిపారు. మరోవైపు వామపక్షాలకు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తాయనే దానిపై కూడా క్లారిటీ లేదు. మొత్తానికి ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో అడుగుపెట్టాలని భావిస్తున్న కోదండరామ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Kodandaram, Telangana