హోమ్ /వార్తలు /national /

మేం మీలా అమ్ముడు పోలేదు: టీఆర్ఎస్‌‌పై కోదండరాం ధ్వజం

మేం మీలా అమ్ముడు పోలేదు: టీఆర్ఎస్‌‌పై కోదండరాం ధ్వజం

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Image: Facebook)

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Image: Facebook)

తామేమీ టీడీపీలో విలీనం కాలేదని కోదండరాం మండిపడ్డారు. ప్రజాకూటమి సీట్లను దీపావళి రోజు ప్రకటిస్తే బావుంటుందని కోదండరాం అభిప్రాయపడ్డారు.

  ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి పోతుంది. టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళ్తుంది. టీజేఎస్‌కు ఓటేస్తే ఎటూ కాకుండా పోతుంది.’ అంటూ కోదండరాం సారధ్యంలోని టీజేఎస్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్న టీఆర్ఎస్ నేతలకు ప్రొఫెసర్ కౌంటర్ ఇచ్చారు. 2014లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆంధ్రా కాంట్రాక్టర్లకు టోకున అప్పజెప్పారని మండిపడ్డారు. అలా తాకట్టుపెట్టిన దాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రత్యేర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ కాంట్రాక్టర్లకు ఎన్నివేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎన్నివేల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, తెలంగాణవారు పెట్టుకున్న స్కూళ్లకు ఎలాంటి సహకారాలు అందించారు? ఆంధ్రా కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

  పదే పదే చంద్రబాబుకు సాగిలపడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలుపై కోదండరాం స్పందించారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు కోసం చంద్రబాబును ఎందుకు కలవాలని ప్రయత్నించారని ప్రశ్నించారు. అనంతపురం ఎందుకు వెళ్లారని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కోసం తామందరం కలసి వెళుతున్నామని, అందుకోసం స్పష్టమైన ఎజెండా ఉందన్నారు. ఆ ఒప్పందంలో తేడా వస్తే ఎవరిదారి వారు చూసుకునే వెసులుబాటు ఉందన్నారు. పదే పదే తమ మీద విమర్శలు చేయడానికి తామేమీ టీడీపీలో విలీనం కాలేదని కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంత గట్టిగా పోరాడామో, ఇప్పుడు కూడా అంతే దృఢసంకల్పంతో పోరాడుతున్నట్టు కోదండరాం చెప్పారు. అప్పటికంటే ఇప్పుడు మరింత రాటుదేలామన్నారు. తక్షణ అవసరాల కోంస కక్కుర్తిపడే అవకాశం లేదని స్పష్టం చేశారు.

  ప్రజాకూటమి సీట్లను దీపావళి రోజు ప్రకటిస్తే బావుంటుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. తాము 10 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. సీట్ల విషయంలో అటు కాంగ్రెస్ కానీ, ఇటు టీజేఎస్ కానీ ఎక్కడో ఓ చోట కాంప్రమైజ్ కాక తప్పదని కోదండరాం అన్నారు. అయితే, ఉభయులకూ లాభం జరిగేలా నిర్ణయం ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. టీజేఎస్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సిందిగా రాహుల్ కోరిన మాట వాస్తవమేనన్న కోదండరాం, అది సాధ్యం కాదని చెప్పామన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో సీపీఐ అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని, వారిని కూడా కలుపుకొని వెళ్లాలని తాము భావిస్తున్నట్టు కోదండరాం తెలిపారు.

  ఇవి కూడా చదవండి

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Chandrababu naidu, Kodandaram, Praja Kutami, Rahul Gandhi, Tdp, Telangana Election 2018, Tpcc, Trs

  ఉత్తమ కథలు