తాజాగా జరిగిన ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో హవా చాటిన టీఆర్ఎస్ పార్టీ.. ఖమ్మంలో మాత్రం చతికిలపడింది. గత ఎన్నికల్లో మాదిరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్కస్థానానికి పరిమితమైంది. మిగతా స్థానాలను మహాకూటమికి వదిలేసుకోవాల్సి వచ్చింది. అయితే, దీనికి తమనేతల స్వయంకృతాపరాధమే కారణమని సీఎం కేసీఆర్ ఫలితాల రోజునే స్పష్టం చేశారు. నేతల మధ్య సమన్వయ లోపం, పరస్పర కుట్రలే జిల్లాలో పార్టీ ఓటమికి కారణమయ్యాయని కుండబద్దలు కొట్టారు. అయితే, ఆ కుట్రలు చేసిందెవరు? పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందెవరు? వంటి వివరాలతో నివేదికలు పంపాలని ఓడిన నేతలకు సూచించారు కేసీఆర్. దీంతో ఖమ్మం జిల్లా నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఓడిన అభ్యర్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులన్నీ.. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీదే. ఆయనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అభ్యర్థుల ఓటమికి కారణమైనట్టు వివరిస్తూ అధిష్ఠానానికి లేఖలు రాశారు. దీంతో సీఎం కేసీఆర్.. ఎంపీ శ్రీనివాస్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయనపై సస్పెన్షన్ వేటు తప్పదనే ప్రచారమూ జరుగుతోంది. తాజా ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరావు, కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు, వైరా నుంచి పోటీ చేసిన మదన్‌లాల్, సత్తుపల్లి నుంచి పోటీ చేసిన పిడమర్తి రవి.. ఓటమి చవిచూశారు. అయితే, అందరూ తమ ఓటమికి కారణం ఎంపీ వర్గమేనని ఆరోపిస్తున్నారు.
మొదట, జలగం వెంకట్రావు ఓటమిపై నివేదిక తయారు చేసి అధిష్ఠానానికి సమర్పించారు. తాజాగా, తుమ్మల సైతం ఫిర్యాదులను పార్టీ కార్యదర్శకులకు పంపాలంటూ పిలుపునివ్వడంతో.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు తెలంగాణలోని ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న గులాబీ బాస్‌కు ఇప్పుడీ కొత్త తలనొప్పి వచ్చిపడింది. దీనికి తోడు, నాయకుల గొడవల కారణంగా కిందిస్థాయి క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వైసీపీ తరపున గెలిచిన వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అలా ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ తనకంటూ హార్డ్‌కోర్ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారనే టాక్ ఉంది. టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ తన వర్గం పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటూ వస్తున్నారని మరోవర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పట్టు పెంచుకున్నారు. అలా, శ్రీనివాసరెడ్డి.. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు సొంతపార్టీలోనే ప్రత్యర్థివర్గంగా తయారైనట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయాలు.. ప్రస్తుతం తుమ్మల వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. కావాలనే తుమ్మలతో సహా ఇతర అభ్యర్థులను పొంగులేటి ఓడించారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టాలనే వ్యూహంతో ప్రత్యర్థివర్గాలు ముందుకు వెళ్తున్నాయి. అయితే పొంగులేటి మాత్రం.. కేసీఆర్ మంత్రివర్గంలో దూరిపోయేందుకు లాబీయింగ్ చేస్తున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో తనవర్గం సర్పంచ్‌లను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటాలని చూస్తున్నారు పొంగులేటి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం స్థానంలో గెలిచిన ఏకైక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తోనూ ఎంపీ శ్రీనివాసరెడ్డి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒక వేళ మంత్రిపదవిని అజయ్‌కి ఇచ్చినా తనకు ఓకే అంటూ.. తుమ్మల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఓడిపోయిన వారిని అందలం ఎక్కించడం వల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు అందుతాయని అంటున్నారు.
మరోవైపు, ఓడిననేతలంతా ఒక్కటై పొంగులేటిపై టీఆర్ఎస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. పొంగులేటిని సస్పెండ్ చేస్తారా? లేక నేతల మధ్య సయోధ్య కుదురుస్తారా? అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, KTR, Mahakutami, Telangana, Telangana Election 2018, Telangana News