దేశం యావత్తూ ఆసక్తిగా గమనించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై పర్యటన ముగిసింది. బీజేపీని బంగాళాఖాతలో కలపడం, ప్రధాని నరేంద్ర మోదీని గద్దెదించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో పార్టీల ఏకీకరణ దిశగా గులాబీ బాస్ చేపట్టిన యాత్ర ఫలితం వెల్లడైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ముంబైలో మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తో విడివిగా భేటీ అయ్యారు. ఇద్దరు నేతలతోనూ కేసీఆర్ సంయుక్తంగా మీడియా సమావేశాలు నిర్వహించారు. తాము ఏం మాట్లాడుకున్నది, తదుపరి ఏం చేయబోయేది నేతలు బాహాటంగా వెల్లడించారు..
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన కేసీఆర్ బృందం వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీఎం ఠాక్రే ఇంటికెళ్లి లంచ్ తర్వాత రాజకీయ చర్చలు చేశారు. అనంతరం ఠాక్రే, కేసీఆర్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అందులో కేసీఆర్ మాట్లాడుతూ..
దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రావాల్సిన మార్పులపై చర్చించామని, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇదేనని, దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని కేసీఆర్ అన్నారు. ప్రస్తుత మోదీ సర్కార్ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, వైఖరి మార్చుకోకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ రావాలని ఉద్ధవ్ ఠాక్రేను కోరానని, ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని కేసీఆర్ తెలిపారు.
ఛత్రపతి శివాజీ, బాల్ ఠాక్రే వంటి యోధుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పోరాడుతామని, పటిష్టమైన దేశం కోసం అందరూ కృషి చేయాలని, దేశంలో గుణాత్మకమైన మార్పు అవసరమని, రాబోయే రోజుల్లో కలిసి పని చేయాలని నిర్ణయించామని, త్వరలో హైదరాబాద్‌లో లేదా మరో చోట అందరం నేతలం కలుస్తామని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉమ్మడి సరిహద్దు 1000 కిలోమీటర్లు ఉందని, రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Mumbai, NCP, Sharad Pawar, Shiv Sena, Trs, Uddhav Thackeray