కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర పీఏ రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. రమేశ్ ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలు పరమేశ్వర, మాజీ ఎంపీ అర్‌ఎల్ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇళ్లపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు గురువారం, శుక్రవారం దాడులు చేపట్టారు. పరమేశ్వర ఇంటితో పాటు విద్యాసంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రమేష్ ఇంటిపై కూడా అధికారులు దాడులు చేశారు. అయితే, తాము సోదాలు నిర్వహించిన వారిలో రమేష్ లేడని ఐటీ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. నిన్న ఐటీ దాడులు జరగడం, నేడు రమేశ్ ఆత్మహత్యకు పాల్పడడంతో రాజకీయంగా కలకలం రేగింది. అయితే, రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
రమేశ్ ఆత్మహత్యపై పరమేశ్వర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఐటీ సోదాలు జరిగిన సమయంలో రమేష్ తనతోనే ఉన్నాడని.. భయపడాల్సిన పనిలేదని తాను ధైర్యం చెప్పినట్టు పరమేశ్వర తెలిపారు. మృదు స్వభావి అయిన రమేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియట్లేదని పరమేశ్వర అన్నారు. పరమేశ్వర, ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లతోపాటు 30 చోట్ల జరిపిన ఐటీ దాడుల్లో రూ.5 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, IT raids, Karnataka Politics