కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షపై చర్చ జరుగుతున్న వేళ.. సాక్షాత్తూ సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్‌డీ రేవణ్ణ చేతిలో నిమ్మకాయలు కనిపించాయి. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కుమారస్వామి మంత్రాలతో తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. అయితే,ఆ ఆరోపణలను కుమారస్వామి తప్పుబట్టారు. మంత్రాలతో అధికారాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. మంత్రి రేవణ్ణ సహజంగానే భక్తుడని, రోజూ ఆలయానికి వెళుతూ ఉంటాడని చెప్పారు. అదే సమయంలో గుడికి వెళ్లగా అక్కడ పూజారులు నిమ్మకాయలు ఇచ్చారని, వాటిని తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినా.. అక్కడ వారికి కూడా నిమ్మకాయలు ఇస్తారని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంక్షోభం తలెత్తింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 1.30 లోపు ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా నుంచి లేఖ వచ్చింది. అయితే, ఆ గడువు కూడా ముగిసిపోయింది. మరోవైపు ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందని, చర్చ సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress-jds, Hd kumaraswamy, Hd revanna, Karnataka political crisis