భిన్నత్వంలో ఏకత్వం.. భిన్నమతాలు, కులాల కలయకే మన భారత్ అని చెప్పుకుంటుంటం. కానీ మన దేశంలో ఇప్పటికీ కూడా కులగజ్జీ కొన్నిచోట్ల పాతుకుపోయింది. అభివృద్ధిలో పరుగులు తీస్తున్న జనం మాత్రం ఇంకా కులాలు, మతాలు అంటూ కొట్టుకుచస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఎంపీకి కూడా ఘోర అవమానం జరిగింది. తమ ఊరిలోకి దళితులు రావడానికి వీల్లేదని ఏకంగా ఓ లోక్ సభ సభ్యుడినే ప్రజలు అడ్డుకున్నారు. దళితులను తమ ఊర్లోకి అనుమతించేది లేదని అక్కడి జనం తేల్చి చెప్పారు. దీంతో సదరు ఎంపీ చేయలేక... మనస్తాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత నారాయణ స్వామి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చిత్రదుర్గ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నారాయణ స్వామి దళిత సామాజికవర్గానికి చెందినవారు. ఈ క్రమంలో తుమకూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు, అక్కడుండే జనానికి మందులు ఇచ్చేందుకు ఓ మెడికల్ టీం తీసుకొని ఆయన జిల్లాలోని పావగడకు ఎంపీ బయలుదేరారు. అయితే ఆ గ్రామం వద్ద ఎంపీకి ఊహించిన ఘటన ఎదురైంది. దళితుల కులానికి చెందిన నారాయణ స్వామిని తమ ఊరిలో అడుగుపెట్టనివ్వబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు.
వెంటనే వెళ్లిపోవాలని జనం తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపానికి లోనైన నారాయణస్వామి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తుమకూరు ఎస్పీ విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై కర్నాటక డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్ నారాయణ ఖండించారు. దళితుడని ఎంపీని అడ్డుకోవడం సరికాదున్నారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. మనమంతా ఒక్కటే అన్నారు. మనలో ప్రవహిస్తున్న రక్త మాంసాలన్నీ ఒకేలా ఉంటాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka bjp, Karnataka Politics