ఎన్నికల సమయంలో ఓట్లడిగేటప్పుడు ఓటరు దేవుడిలా కనిపిస్తాడు. అదే గెలిపించిన తర్వాత అయ్యా మా సమస్య ఇది అని చెప్పుకుంటే చూద్దాంలే అని కొట్టిపారేసే వారు కొందరు. చేయిస్తా అని మాటిచ్చి పక్కకు పోయేవారు ఇంకొందరు ఉంటారు. కాని కర్నాట(Karnataka)కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA)ఈవేం చేయలేదు. మా ఊర్లో రోడ్లు బాగోలేవు సార్..కాస్త రోడ్లు వేయించండి అన్నాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు. అంతే అతని నోట్లోంచి ఆ మాట వచ్చిన వెంటనే చెంప చెళ్లు మనిపించారు పావగడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణప్ప (Venkataramanappa). అంతటితో ఆగకుండా కళ్లు పెద్దవి చేసి చూస్తూ ఆ యువకుడ్ని భయపెట్టాడు. నన్నే రోడ్లు వేయించమని అడుగుతావా..ఎవర్రా నువ్వు అంటూ నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడారు ఎమ్మెల్యే...ప్రజాప్రతినిధికి తమ సమస్య చెప్పుకునేందుకు ఆశగా వచ్చిన యువకుడ్ని కొట్టడమే కాకుండా అతను చెప్పేది వినిపించుకోకుండా..అతడ్ని అవమానించారు ఎమ్మెల్యే వెంకటరమణప్ప. ఎమ్మెల్యే ఓ గ్రామస్తుడి చెంప చెళ్లు మనిపించడం అక్కడున్న కొందరు ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ (Viral)అవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో(Video) ఇప్పుడు కర్నాటకతో పాటు అన్నీ రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతోంది.
సమస్యలు చెబితే కొడతారా..
పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్ప బుధవారం మధ్యాహ్నం పావగడలోని తహశీల్దార్ కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు. అది ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణమయ్యేందుకు తన కారు దగ్గరకు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నలుగురిలో పట్టుకొని తనను నిలదీశాడనే కోపంతో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. చుట్టూ జనం చూస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి యువకుడ్ని చెడా,మడా తిట్టాడు. అక్కడున్న వాళ్లు యువకుడిని పక్కకు వెళ్లమని చెప్పడంతో ఎమ్మెల్యే కారు ఎక్కివెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత యువకుడు బాధపడుతూ గ్రామంలో రోడ్లు సరిగా లేవని చెబితే కొడతారా...అందుకేనా గెలిపించింది అంటూ కోపంతో తన ఆవేదన వెళ్లగక్కాడు. ఈవిషయంపై ఎమ్మెల్యేని సారీ చెప్పమని స్థానిక నేతలు చెప్పినప్పటికి వెనక్కి తగ్గలేదట వెంకటరమణప్ప.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రవర్సీ..
నాయకులకు సహనం ఉండాలి. నియోజకవర్గ ప్రజలందరి సమస్యలు వినేంత ఓర్పు కావాలి. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల ఓట్లతో గెలిచి..తర్వాత కార్లలో తిరగడం కాదని..వాళ్లకు సమస్యలు రాకుండా చూస్తే మళ్లీ అడగకుండానే ఓట్లు వేసి గెలిపిస్తారనే చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి ఖాళీ అవుతున్న టైమ్‌లో కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ రేంజ్‌లో శివాలెత్తడం, ఆ వీడియో వైరల్ కావడం ఆపార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.