POLITICS KAPIL SIBAL RESIGNS FROM CONGRESS AND FILES RAJYA SABHA NOMINATION WITH SAMAJWADI PARTY SUPPORT SK
Kapil Sibal: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా.. ఊహించని ట్విస్ట్
కపిల్ సిబల్
Kapil Sibal: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ గుడ్ బై చెప్పారు. ఇవాళ అనూహ్యంగా సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేశారు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి సతమతమవుతున్న పార్టీని.. నేతల రాజీనామాలు మరింత కుంగదీస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఏకంగా ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ (Kapil sibal resigns congress)కు గుడ్ బై చెప్పారు. అంతేకాదు అనూహ్యంగా సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)మద్దతుతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడీ పరిణామాలు దేశరాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇవాళ ఉదయం లక్నోలో ఆయన రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేశారు. కపిల్ సిబల్ వెంట సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఉన్నారు.
#WATCH | Uttar Pradesh: Congress leader Kapil Sibal files nomination for Rajya Sabha election, in the presence of Samajwadi Party (SP) chief Akhilesh Yadav, in Lucknow. pic.twitter.com/8yRDoSwE3g
నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన కపిల్ సిబల్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ''మే 16నే కాంగ్రెస్ హైకమాండ్‌కు రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు. మే 16న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేశాను. ఈ దేశంలో స్వతంత్ర గొంతుగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటాను. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా బలమైన కూటమి ఏర్పడాల్సి ఉంది.'' అని చెప్పారు.
యూపీ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీకి 111 మంది ఎమ్మెల్యేల బలముంది. రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా మూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది. అందులో రెండు సీట్లను కపిల్ సిబల్‌కు, ఒక సీటును ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధురి (Jayant Choudhuri) కి కేటాయించారు. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలతో కపిల్ సిబల్‌కు బలమైన సబంధాలున్నాయి. స్వతహాగా లాయర్ అయిన సిబల్.. పలు కేసులకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీకి సాయం చేశారు. గతంలో జైలు పాలైన ఆజంఖాన్‌కు ఆయనే బెయిల్ తీసుకొచ్చారు. అంతేకాదు 2017లో అఖిలేష్ యాదవ్ కుటుంబంలో గొడవలు జరిగినప్పుడు.. సైకిల్ గుర్తు అఖిలేష్ యాదవ్ వర్గానికే దక్కేలా తెరవెనక కపిల్ సిబలే నడిపించారు.
కాగా, గత కొంత కాలంగా కాంగ్రెస్ హైకమాండ్‌పై కపిల్ సిబల్ తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. సంస్కరణలు చేపట్టకపోతే పార్టీ ఎప్పటికీ కోలుకోలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలను నిర్వహించాలని.. బలమైన నేతకే పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకదశలో కాంగ్రెస్ పార్టీలో గాంధీల పెత్తనంపై ఆయన ఎదురు తిరిగినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచీ ఆయన్ను సోనియా, రాహుల్ గాంధీలు దూరం పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసి.. ఎస్పీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా..రాజ్యసభకు నామినేషన్ వేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.