Rajinikanth Kamal Haasan: ఎన్నో ఏళ్ల అభిమానుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ జర్నీని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 31న తన పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని ఇటీవల రజనీ స్పష్టం చేశారు. అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రజినీకాంత్ తన పార్టీ పేరుని, గుర్తుని ఖరారు చేయడమే కాదు. రిజిష్ట్రేషన్ పనులను కూడా పూర్తి చేయించినట్లు తెలుస్తోంది.
తలైవా తన పార్టీ పేరుని ‘మక్కల్ సేవై కట్చి(ప్రజా సేవ పార్టీ అని అర్థం)’ అని, పార్టీ గుర్తుగా ‘ఆటో రిక్షా’ని రిజిష్టర్ చేయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రజనీ సహ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మక్కల్ నీది మయ్యమ్ పేరుతో పార్టీని ప్రారంభించిన కమల్.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రజనీతో కలిసి పనిచేయడంపై మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టారు లోకనాయకుడు కమల్ హాసన్.
ప్రజలకు మేలు జరుగుతుందంటే.. తమ ఇగోను వదిలి రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని కమల్ తెలిపారు. దీనిపై ముందు కూడా తాను స్పష్టతను ఇచ్చానని.. అందులో కొత్తగా చేర్చాల్సింది ఏమీ లేదని లోకనాయకుడు స్పష్టం చేశారు. తనలాగే తమిళనాడు అభివృద్ధి కోసం రజనీకాంత్ గళమెత్తారని ఆయన అన్నారు.
ముందు రజనీకాంత్ తన ఐడియాలజీ ప్రకటించే వరకు ఎదురుచూడాలని తెలిపారు. తామిద్దరి ఐడియాలజీలు కలిస్తే.. ఆ తరువాత కలిసి పనిచేసేందుకు మిగిలిన విషయాలపై మాట్లాడుతామని వివరించారు. కాగా అవినీతికి వ్యతిరేకంగా మంచి రాజకీయాలు చేసేందుకు తాము ఎదురుచూస్తున్నామని.. అందుకోసం ఇద్దరం కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమని రజనీకాంత్, కమల్ హాసన్ ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamal haasan, Rajinikanth, Tamil nadu