ప్రముఖ నటి, బీజేపీ నేత, మాజీ ఎంపీ జయప్రద మరోసారి పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. గతంలో రాంపూర్ లోక్సభ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన ఆమె.. గత ఎన్నికల్లో ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2009, 2014 ఎన్నికల్లో ఎస్పీ నుంచి గెలుపొందిన జయప్రద.. బీజేపీలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే, అంతకుముందే రాంపూర్ అసెంబ్లీ నుంచి గెలిచి, ఆ తర్వాత అదే పార్లమెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచిన ఆజంఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానంలో బీజేపీ తరఫున జయప్రద పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. మరోవైపు, సమాజ్వాదీ పార్టీ తరఫున యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కనౌజ్ ఎంపీగా పోటీచేసి ఓటమి చెందిన ఆమెను ఆ స్థానంలో నిల్చోబెడితే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు.
మరోవైపు, లోక్సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీ.. ఫలితాల తర్వాత ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఇక జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు కూడా.
ఏదేమైనా, ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడే అవకాశం ఉండడంతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 1980 నుంచి ఈ స్థానంలో ఎస్పీ తప్ప మరో పార్టీ గెలవలేదు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, Bjp, Jaya Prada, Samajwadi Party