తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే సంకేతాలిస్తూ మెగా కొలువుల జాతర ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకే సారి 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, కాట్రాక్టు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ పోను, కొత్తగా 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం వెలువరించిన ప్రకటనను విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. 2018 నుంచీ అమలు కాకుండా ఉన్న నిరుద్యోగ భృతి, మొత్తం 1.91లక్షల కొలువులుంటే కేవలం 80వేలు భర్తీచేయడమేంటని విపక్షనేతలు మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో అడుగు ముందుకేసి.. కేసీఆర్ కొలువుల ప్రకటనను బీజేపీ విజయంగా భావిస్తున్నామన్నారు..
సీఎం కేసీఆర్ మెగా కొలువుల ప్రకటనతో కూడిన అసెంబ్లీ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, నాలుగేళ్లు ఆలస్యం చేసిన కేసీఆర్.. కేంద్రంపై నిందలు వేయడం సరైంది కాదని ఆక్షేపించారు. ఎప్పుడో 2018లోనే తెలంగాణ జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందని, ఆ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగానే కేసీఆర్ 317 జీవోను జారీ చేశారన్నారని గుర్తుచేశారు.
తెలంగాణలో 12 వేల మంది విద్యా వాలంటీర్లను, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని, 15వేల మంది స్టాఫ్ నర్సులను మళ్లీ పునరుద్ధరించలేదని, 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని, అబద్ధాల చరిత్ర కాబట్టే కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించడంలేదన్నారు. ఆలస్యంగానైనా వచ్చిన ఉద్యోగాల ప్రకటనను బీజేపీ విజయంగా భావిస్తున్నామని, ప్రకటించిన ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని, నిరుద్యోగులకు ఆశపెట్టి నెరవేర్చకుంటే ఊరుకునేది లేదని, పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు ఇచ్చే వరకు పోరాడుతామని బండి సంజయ్ అన్నారు. మరో కీలక అంశం..
సీఎం కేసీఆర్ హడావుడిగా అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం వెనుక అసలు విషయం ఇదేనంటూ బండి సంజయ్ ఓ సంగతి చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం, నోటిఫికేషన్ల డిమాండ్ తో బీజేపీ భారీ మిలియన్ మార్చ్ కు సిద్దమైందని, కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ తపెట్టిన నిరుద్యోగుల మిలియన్ మార్చ్ గురించి ఇంటెలిజెన్స్ ద్వారా అందిన సమాచారం చూసి సీఎం కేసీఆర్ షాక్ తిన్నారని సంజయ్ తెలిపారు.
మిలియన్ మార్చ్ ద్వారా కమలదళం రాజేసే పొగ ప్రగతి భవన్ లో కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయిలో ఉంటుందనే భయపడే అప్పటికప్పుడు కొలువుల ప్రకటన చేశారని బండి పేర్కొన్నారు. బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్న కేసీఆర్ మిగిలిన లక్ష ఉద్యోగాలు ఎక్కడికిపోయాయి?ఇవాళ అసెంబ్లీలో నిరుద్యోగ భృతిపై ఎందుకు ప్రకటన చేయలేదు? అని టీబీజేపీ చీఫ్ ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR, Job notification, Telangana Assembly, Telangana Budget 2022, Telangana jobs, Trs