హోమ్ /వార్తలు /national /

ఫిరాయింపులతో టీఆర్ఎస్‌కు నష్టమెంత... కాంగ్రెస్‌కు లాభమెంత ?

ఫిరాయింపులతో టీఆర్ఎస్‌కు నష్టమెంత... కాంగ్రెస్‌కు లాభమెంత ?

ఉత్తమ్, కేసీఆర్ file

ఉత్తమ్, కేసీఆర్ file

పార్టీ ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్ర సమితికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో భవితవ్యం పరీక్షించుకుంటున్నారు. సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగానే కొందరికి మినహా మిగతా అందరికీ మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేకు తోడు ముఖ్య నాయకులంతా ఒక్కొక్కరుగా కారెక్కడం ప్రారంభించారు.

అర్హులైన నాయకులందరికీ అవకాశం చిక్కినప్పుడల్లా పదవులు ఇస్తూ వచ్చారు. రాజ్యసభ సభ్యత్వం మొదలు కార్పోరేషన్, కార్పోరేటర్ దాకా ఆయా పదవులు కట్టబెట్టారు. వచ్చిన పదవితో సంతప్తి చెందిన వారు కొందరయితే... ఉన్న పదవికి తోడు మరో పదవి వస్తుందని ఆశించారు నాయకులు కొందరు. దీంట్లో భాగంగా చాలా మంది నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉన్న నేపథ్యంలో ఎవరికి అవకాశం కల్పించినా ఇబ్బందులు తప్పేలా లేవని గ్రహించిన అధినేత సిట్టింగ్ లలో దాదాపుగా అందరికీ టికెట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ టికెట్ వస్తుందని పెట్టుకున్న ఆశలు అడియాశలు కావడంతో నాయకులు ఒక్కొక్కళ్లుగా పక్క చూపులు చూడటం ప్రారంభించారు.

No alliance with bjp, says telangana caretaker cm kcr
కేసీఆర్ (ఫైల్ ఫోటో)

“డి. శ్రీనివాస్ కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ప్రాధాన్యత ఇచ్చాం. రాజ్యసభకు పంపించాం. ఆయనిష్టం.. పార్టీలో చేరిన అర్హులైన వాళ్లందరినీ గౌరవించాం. ఒక నియోజకవర్గానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వగలం కదా... ప్రభుత్వం వచ్చాక అందరికీ అవకాశాలుంటాయి. లేదు వెళ్తామంటే వెళ్లనిస్తాం. వాళ్లింష్టం” అని ముఖ్యమంత్రి గతంలో ఓ మీడియా సమావేశంలో అన్నారు.

ఆందోల్ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ బీజేపీలో చేరారు. వరంగల్‌కు చెందిన కొండా సురేఖ, ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతి రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రమేష్ రాథోడ్, ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గంకు చెందిన నర్సారెడ్డి తదితరులంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ దాదాపుగా టీఆర్ఎస్ ను వీడినా... రాజ్యసభ సభ్యత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు.

టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)
టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

మరో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గానికి చెందిన బొడిగె శోభ, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మెన్ తుల ఉమ పార్టీ వీడే ప్రయత్నంలో ఉన్నారు. అయితే... తుల ఉమ మాత్రం తాను పార్టీ వీడటం లేదని... వేములవాడ టికెట్ అడిగే హక్కు తనకు ఉందని అంటున్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు తాను పార్టీ వీడతాననే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది టీఆర్ఎస్ కుంటుంబ సమస్య అని... మళ్లీ తామే అధికారంలోకి రాబోతున్నామని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌తో తుల ఉమ( ఫైల్ ఫోటో)
కేసీఆర్‌తో తుల ఉమ( ఫైల్ ఫోటో)

ఆందోల్ లో బాబూ మోహన్ మళ్లీ బరిలో దిగుతున్నారు. టీఆర్ఎస్ నుంచి జర్నలిస్టు క్రాంతికిరణ్ కు టికెట్ ఇచ్చింది పార్టీ... ఇక... కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ పోటీలో దిగుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య ముఖాముఖి పోరు ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం వల్ల కాంగ్రెస్ కు విజయావకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయనేది ఓ విశ్లేషణ. కొండా సురేఖ వరంగల్ జిల్లాలో బలమైన నాయకురాలు. ఈ సారి ఆమె వరంగల్ నుంచి, ఆమె కుమార్తెకు భుపాలపల్లి టికెట్ కావాలని కోరుతున్నారు. ఆయా స్థానాల్లో వీరిద్దరు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

కొండా సురేఖ, మురళి ఫైల్ ఫోటో(Image:Facebook)
కొండా సురేఖ, మురళి ఫైల్ ఫోటో(Image:Facebook)

టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ న్యూస్ 18 తో మాట్లాడుతూ “ఈ వలసలు మా పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. చేరే నాయకులంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ఆయా ప్రాంతాల్లో మా పార్టీ మరింత బలపడుతుంది. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులందరకీ ఎట్టి పరిస్థితుల్లో బీ ఫామ్ ఇవ్వరు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి చాలా మంది మా టీఆర్ఎస్ నుంచి మా పార్టీలో చేరుతారు.” అని అన్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకునిగా శ్రీనివాస్ ప్రభావం జిల్లాలో కచ్చితంగా ఉంటుంది. గతంలో జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఈ సారి ఎన్నికల్లో అదే రకమైన ఏకపక్ష ఫలితాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గం టీఆర్ఎస్ నేత నర్సారెడ్డి... కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. మెదక్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమెపై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా... కాంగ్రెస్ నుంచి బలమైన ప్రత్యర్థి లేడన్న వాదనల నేపథ్యంలో ఆమె సునాయాసంగానే విజయం సాధించే అవకాశాలు కనిపించాయి. అయితే... నర్సారెడ్డి మెదక్ నుంచి పోటీ చేస్తే పద్మ విజయావకాశాల మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రమేష్ రాథోడ్ కూడా ఇది వరకే కాంగ్రెస పార్టీలో చేరారు.

ఇదే విషయమై పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్ఎస్ అభ్యర్థి బాల్కా సుమన్ న్యూస్ 18తో మాట్లాడుతూ... “ఒక నియోజకవర్గానికి ఒకరు మాత్రమే పోటీ చేయగలరు. అందుకే పార్టీ ఒకరికే టికెట్ ఇచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఆశావాహులందరికీ మళ్లీ ఏదో పదవి వస్తుందని చెప్పారు. నాయకులు పార్టీ వీడటం బాధగా ఉంది. అయినా వెళ్లే వాళ్లంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే వెళ్తున్నారు. వారు వెళ్లినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు.“ అన్నారు.

ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కొనసాగిన ఇతర పార్టీల్లో చేరిన నాయకులంతా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులే. వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం వళ్ల ఇది వరకు వాళ్ల వెంట ఉన్న కాడర్ లో కొంతయినా వారి వెంట వెళ్లే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు ఉండే ప్రాంతాల్లో వీరి ప్రభావం కచ్చితంగా ఉంటుందనేది వాదన బలంగా ఉంది. దీనికి తోడు త్రిముఖ పోటీ ఉండే స్థానాల్లో ఓట్లు చీలి మరో పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంటుంది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైల్ ఫోటో(Image:Facebook)
కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఏదేమైనా ఈ పార్టీ ఫిరాయింపులు రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపకపోయినా.. ఆయా స్థానాల్లో మాత్రం కచ్చితంగా ప్రభావం చూపే అవకాశమే ఉంటుంది.

కొందరు నేతలు పార్టీ మారడం ద్వారా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని టీఆర్ఎస్ అంటోంది. అయితే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్న నేతల వల్ల తమకు కచ్చితంగా లాభం కలుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

తెలంగాణ, కాంగ్రెస్, టీఆర్ఎస్, కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ ఫిరాయింపులు, డి.శ్రీనివాస్, డీఎస్, telangana, congress, trs, kcr, uttam kumar reddy, assembly elections, defections, d Srinivas, ds

First published:

Tags: Bjp, CM KCR, Congress, D Srinivas, Telangana, Telangana Election 2018, Trs

ఉత్తమ కథలు