జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పగ్గాలను.. కేటీఆర్‌కు అప్పగించారు. ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇక, పార్టీ కేటీఆర్ నేతృత్వంలోనే ముందుకు సాగాలని, నేతలంతా ఆయన వెన్నంటే ఉండాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉండడంతో పాటు.. పాలనపై ఎక్కువ దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నందున.. పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్టు చెప్పారు కేసీఆర్. అంతేకాదు, తాను ఫెడరల్ ఫ్రంట్‌తో జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండబోతున్నందున.. పనిఒత్తిడి తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే.. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీవర్గాలకూ, రాజకీయవర్గాలకూ ట్విస్టును తలపించింది. మున్ముందు ఇలాంటి ట్విస్టులు మరిన్ని ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తోంది. కానీ, కేసీఆర్ వ్యూహాలను అంచనావేయడం అంత ఈజీ కాదు కాబట్టి.. పార్లమెంట్ ఎన్నికల్లోపు మరెలాంటి ట్విస్టు ఇవ్వబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది.
ఇప్పటికే తన రాజకీయవారసుడిగా కేటీఆర్‌ను ప్రకటించిన కేసీఆర్... పార్టీ పగ్గాలను అప్పగించేశారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. మరో కీలక నిర్ణయం తీసుకోవడంపై కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కీలకమైన ముఖ్యమంత్రి బాధ్యతలనూ సాధ్యమైనంత త్వరగా వదులుకోవాలనుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. 2019లోనే కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠం కూడా అప్పగించాలనే యోచనలో ఆయన ఉన్నట్టు రాజకీయంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. అందులో భాగంగానే ఆయన సీఎం పదవిని, కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి.. ఎంపీగా పోటీచేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే... ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన , నల్గొండ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ సభలో మాట్లాడిన కేసీఆర్, తాను నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయాలనుకున్నానని, అయితే భూపాల్ రెడ్డి ముందుకు రావడంతో వెనక్కు తగ్గానని చెప్పారు. అయితే, నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా తన కోరికను తీర్చుచుకునే అవకాశం ఉందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ఇలా చేయడం వల్ల, జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టంగా మారుతుందనేది ఆయన ఆలోచనగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఆయన ఎంపీగా పోటీచేస్తే, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనే అంశంలోనూ జోరుగా చర్చ మొదలైంది. ఏదేమైనా.. ఎన్ని రూమర్లు వచ్చినా.. గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాబట్టి.. ఎంపీగా పోటీ చేస్తారా? చేస్తే ఏ స్థానం నుంచి బరిలో దిగుతారు? మరి ఎమ్మెల్యే స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారు? అనే అంశాలపై అప్పటి పరిస్థితులకు తగ్గట్టే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Gajwel, KTR, Nalgonda, Telangana, Telangana Election 2018, Telangana News