బండ్ల గణేష్... సినీ నిర్మాతగా, కామెడీ ఆర్టిస్టుగా మాత్రమే ఇన్నాళ్లూ జనాలకు తెలుసు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మూడు రంగుల కండువా కప్పుకొన్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదంతా చూసినవాళ్లు అబ్బో... బండ్ల గణేష్‌కు ఎంత పలుకుబడో అనుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయమైపోయింది అన్నారు. టికెట్ పక్కా చేసుకున్న తర్వాతనే పార్టీలో చేరారన్న ప్రచారం జరిగింది. అంతేకాదు... బండ్ల గణేష్ అయితే ఏకంగా తాను ఎమ్మెల్యేను అయిపోయాను అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. కానీ చివరకు ఏమైంది..? బండ్ల గణేష్ కామెడీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పంచ్ ఇచ్చింది. టికెట్ ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. రెండు జాబితాల్లోనూ బండ్ల పేరు కనిపించలేదు.
బండ్ల గణేష్ ఓవర్ యాక్షన్ కొంప ముంచిందన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతి నుంచి ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. టీవీ ఛానెళ్లకు వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానెళ్లను కూడా వదల్లేదు. తాను ఎమ్మెల్యేను అయిపోయాను అన్నట్టుగా... ఛానెల్ స్టూడియోలోనే ప్రమాణ స్వీకారం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నానంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేకాదు... కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో 105 సీట్లు పక్కా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు. ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కొన్ని కామెంట్లూ వివాదాస్పదమయ్యాయి. నోటికొచ్చింది మాట్లాడుతూ చివరకు పార్టీకే తలనొప్పిగా మారిపోయారు. ఆయన కామెడీ చేష్టలతో తెరపైనే కాదు... రియల్ లైఫ్‌లోనూ కమెడియన్ అన్నట్టుగా వ్యవహరించారు.
ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ కామెడీ చేసిన బండ్ల గణేష్‌కు చివరకు ఏ సెంటరూ మిగల్లేదు. షాద్‌నగర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లో ఏదో ఓ స్థానంలో పోటీ చేయాలనుకున్నారు. షాద్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డికి కేటాయించగా... రాజేంద్రనగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌ను విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చేశారు. దీంతో బండ్ల ఆశలు పెట్టుకున్న స్థానాలన్నీ గల్లంతైపోయాయి. నేను ఎమ్మెల్యేను అయిపోతా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించిన బండ్ల గణేష్‌కు... ఎమ్మెల్యే కావడం కాదు కదా... చివరకు టికెట్ కూడా దక్కని దారుణమైన పరాభవం తప్పలేదు. పార్టీలో చేరినప్పటి నుంచి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ, అనవసరమైన కామెంట్లు చేస్తూ, ఓవర్ యాక్షన్ చూపించిన బండ్ల గణేష్‌ను కాంగ్రెస్ పార్టీ కావాలనే పక్కన పెట్టిందా?
ఇవి కూడా చదవండి:
#YourLeader: లీడర్ ఒక్కడే... కండువాలే వేర్వేరు... ఇదీ జగ్గారెడ్డి స్టైల్
తెలంగాణ తీర్పు... 2014లో ఎలా ఉంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు!
తెలంగాణ ఎన్నికలపై సమగ్ర కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
https://telugu.news18.com/tag/telangana-election-2018/
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.